తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించేలా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. పచ్చి అబద్దాలతో ప్రధానమంత్రి మోదీకి లేఖలు రాసి అవాస్తవాలను ప్రచారంలోకి తీసుకొచ్చారన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం బాధ్యతారహితంగా లేఖలు రాసి రైతాంగానికి తప్పుదోవ పట్టించడం దారుణం అన్నారాయన. 


తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరణపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తేల్చేశారని గుర్తు చేశారు బండి సంజయ్‌. పంజాబ్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రం బియ్యం సేకరిస్తుందే తప్ప ధాన్యం సేకరించడం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా రాష్ట్ర రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు బండి. అందుకే ఈ బహిరంగ లేఖ రాసినట్టు పేర్కొన్నారు. 


ధాన్యం కొనుగోలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పౌరసరఫరాల కార్పొరేషన్‌ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉన్నా చేతులెత్తి కేసీఆర్ డ్రామాలాడుతున్నారని సంజయ్ విమర్శించారు. మాయమాటలతో జనాన్ని మభ్య పెట్టాలని చూస్తున్న కేసీఆర్ బండారం బయటపెట్టడమే బహిరంగలేఖ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. 


వడ్ల విషయంలో మొదటి నుంచీ కేసీఆర్‌వి కుప్పిగంతలేనన్నారు బండి. తొలుత వరి వేస్తే ఉరే గతి అని అన్నారని గుర్తు చేశారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని, ధాన్యం పండిస్తే కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదన్నారని పేర్కొన్నారు. ఇప్పుడు మాట మార్చి కేంద్రమే రాష్ట్రంలో పండించిన వడ్లన్నీ కొనుగోలు చేయాలని యాగీ చేస్తున్నారని ఆరోపించారు. ఒక ప్రభుత్వాధినేతగా ఉంటూ కేంద్ర మంత్రులను ఇష్టమొచ్చినట్లుగా బూతులు తిట్టడం చూస్తే కేసీఆర్ వ్యక్తిత్వం అర్థమౌతోందన్నారు. 


కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి ధాన్యం కొనబోమని చెప్పిందనడం నూటికి నూరు శాతం పచ్చి అబద్దమన్నారు బీజేపీ 
రాష్ట్రాధ్యక్షుడు. వానా కాలం మాదిరిగానే యాసంగిలోనూ ధాన్యం సేకరిస్తుందన్నారు. ఈ విషయంలో రైతులను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలు చేసి మర ఆడించి బియ్యంగా మార్చి వాటిని ఎఫ్‌సీఐకి అప్పగించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తోందన్నారు. అందుకయ్యే మొత్తం ఖర్చుతోపాటు ఈ బాధ్యత నెరవేర్చినందుకు రాష్ట్రానికి కమీషన్ల రూపంలోనూ కేంద్రమే డబ్బులు చెల్లిస్తోందని తెలిపారు. 


కేంద్రమే నేరుగా వడ్లు కొనాలంటూ కొత్త ప్రతిపాదన తీసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు బండి. వాస్తవానికి వడ్లను కొనుగోలు చేయడంలో ఐకేపీ కేంద్రాలు కీలకం. మార్కెట్‌ యార్డులు అవసరం. పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం కావాలి. ఇవన్నీ రాష్ట్రం పరిధిలోనే ఉన్నాయి.  ఇది తెలిసి కూడా వడ్లను కేంద్రమే కొనాలని మెలిక పెట్టడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు సంజయ్.  


కొనుగోలు కేంద్రాల మూసివేసి మిల్లర్లు చెప్పిన రేటుకు రైతులు ధాన్యం అమ్ముకుంటారని కేసీఆర్ ప్లాన్‌గా బండి ఆరోపించారు. అప్పుడు మిల్లర్లు వేల కోట్లు దండుకుంటారని.. అందులో వాటా దండుకోవచ్చనే కేసీఆర్ దుర్బుద్ధిగా అభిప్రాయపడ్డారు. డైరెక్టుగా చెబితే వ్యతిరేకత వస్తుందని నెపాన్ని కేంద్రంపై మోపుతూ సమస్యను పక్కదారి పట్టించారన్నారు. వరి ధాన్యం పండించే రాష్ట్రాలు చాలా ఉన్నా అక్కడ ఎలాంటి గొడవ లేదని గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రం ఏపీలోనూ కేంద్రంతో ఏ గొడవా లేదన్నారు. 


రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ధాన్యం సేకరణలోనే పెద్ద కుంభకోణం దాగి ఉందన్నారు బండి సంజయ్‌. రేషన్ బియ్యం రీ సైక్లింగ్, లేని పంటను లెక్కల్లో చూపడం, పక్క రాష్ట్రాల్లోని బియ్యాన్ని తెచ్చి అమ్మడం వంటి వ్యవహారాలు చాలా జరిగినట్లు సమాచారం ఉందన్నారు. మిల్లర్లతో కుమ్మక్కై చేస్తున్న ఈ స్కాం బండారం బయటపడుతుందన్నారు. చిత్తశుద్ధి ఉంటే రైతులు పండించిన ధాన్యాన్ని, ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేయడం చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలన్నారు.


ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలేనని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు మరో ఎంపీ అరవింద్‌. టీఆర్ఎస్ పార్టీని జనం అసహ్యించుకుంటున్నా సీఎం కేసీఆర్ వైఖరిలో మాత్రం మార్పు రాకపోవడం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీయే ఓ అబద్దాల ఫ్యాక్టరీ అని.. ప్రజలను తప్పుదోవ పట్టించడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణ నుంచి ఎంత ధాన్యం పంపిస్తారనే వివరాలను కూడా ఇంత వరకు కేంద్రానికి పంపలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు రాష్ట్ర రైతాంగాన్ని నట్టేట ముంచేలా ఉందని ఆరోపించారు.