Telangana BJP to release First List candidates:


హైదరాబాద్‌: త్వరలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ సైతం రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. దాంతో పార్టీలు అభ్యర్థులు జాబితాపై కసరత్తు చేపట్టాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ ఇది వరకే తొలి జాబితా పేరుతో దాదాపు అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వరుస సమావేశాలతో అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని, అధికారంలోకి వస్తామని చెబుతున్న బీజేపీ తొలి జాబితా మరో వారం రోజుల్లో విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దాదాపు 40 మందితో తొలి జాబితా ప్రకటనను బీజేపీ రెడీగా ఉంది.


119 నియోజకవర్గాలలో క్లారిటీ ఉన్న 40 నియోజకవర్గాల అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయాలని రాష్ట్ర నేతలు ఢిల్లీ అధిష్టానానికి వివరాలు పంపించారు. దీనిపై కసరత్తు చేసి బీజేపీ కేంద్ర అధిష్టానం అమావాస్య తరువాత అక్టోబరు 15 38 నుంచి 40 మందితో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. వచ్చే వారం లేకపోతే 16న పార్టీలో ఏకాభిప్రాయం ఉన్న స్థానాల అభ్యర్థుల జాబితాతో ఎన్నికలకు కమలం నేతలు సన్నద్ధమవుతున్నారు. మొత్తం 3 జాబితాలలో అసెంబ్లీకి అన్ని స్థానాల అభ్యర్థులను బీజేపీ ప్రకటించనుంది.


తెలంగాణపై ఫోకస్ చేసిన బీజేపీ అగ్రనేతలు గత కొన్ని నెలల నుంచి రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. మధ్యలో ఉప ఎన్నికలకు సైతం బీజేపీ అగ్ర నేతలు ప్రచార బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకే అమిత్ షా, జేపీ, ప్రధాని నరేంద్ర మోదీ పలు సభలు, కార్యక్రమాలలో పాల్గొన్నారు. అక్టోబర్ 1న మహబూబ్ నగర్ కు, అక్టోబర్ 3న ప్రధాని మోదీ నిజామాబాద్ జిల్లాలో సభలకు హాజరయ్యారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పాలమూరు వేదికగా ప్రధాని మోదీ ఎన్నికల శంఖారావం పూరించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్ సభలలో బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీపై సైతం విమర్శలు గుప్పించారు. 


అక్టోబర్ 10న తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఆదిలాబాద్‌ జనగర్జన సభ పేరుతో నిర్వహించే సభలో షా పాల్గొంటారని సమాచారం. అదేరోజు సాయంత్రం రాజేంద్రనగర్‌లో నిర్వహించే సభలోనూ అమిత్ షా పాల్గొనే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పార్టీ నేతల నుంచి ప్రకటన వస్తే దీనిపై స్పష్టత రానుంది.