Telangana Minister KTR About Congress:
హైదరాబాద్: కాంగ్రెస్ బేకార్ పార్టీ అని, వాళ్లు ఫెయిల్ కావడంతో పాటు తెలంగాణను, దేశాన్ని వెనక్కి తీసుకెళ్లారని తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదివరకే 11 సార్లు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. అయితే తెలంగాణలో ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశాం, కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఎందుకు లేదో కాంగ్రెస్ అగ్రనేతలు చెప్పాలంటూ నిలదీశారు. 


మంత్రి కేటీఆర్ బుధవారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజలు ఎన్నోసార్లు కాంగ్రెస్ కు ఛాన్స్ ఇచ్చారని, మరో అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. తెలంగాణలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. రాహుల్ గాంధీ ముందుగా మల్లికార్జున ఖర్గేను పార్టీ అధ్యక్షుడిగా గుర్తించాలన్నారు. 2014, 2018 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను నమ్మలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో తెలంగాణను చూసి నేర్చేకోవాలి. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా మారింది. దేశంలో తలసరి ఆదాయం అధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ.. బీఆర్ఎస్ పాలనకు ఇది నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ లాంటి బేకార్ పార్టీ చెప్పే మాటల్ని నమ్మే స్థితిలో ఎవరూ లేరని తెలుసుకుంటే వారికే మేలు జరుగుతుందన్నారు.


కాంగ్రెస్‌ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కేటీఆర్ అన్నారు. పెద్దపల్లికి చెందిన కాంగ్రెస్‌ నేతలు బుధవారం బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్‌ నేతలు సత్యనారాయణరెడ్డి, రామ్మూర్తి మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ను నమ్మితే కర్ణాటక తరహాలోనే తెలంగాణ ప్రజలు మోసపోతారంటూ హెచ్చరించారు. రైతులకు కేవలం 3 గంటలు కరెంట్ చాలన్న కాంగ్రెస్ పార్టీ కావాలో, 24 గంటలు అన్నదాతలకు విద్యుత్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. ఓట్ల సమయంలో ప్రజలు ఆగమాగం కావొద్దని, ఆలోచించి వారికి మేలు చేసిన పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.


ప్రేమలో బీఆర్ఎస్, బీజేపీ! కాంగ్రెస్ వినూత్న ప్రచారం
తాజాగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటే అనే ప్రచారాన్ని మరింత వినూత్నంగా ముందుకు తీసుకువెళ్తోంది. ‘ప్రేమలో బీఆర్ఎస్ - బీజేపీ’ అంటూ వెడ్డింగ్ కార్డులను ముద్రించి పంచుతూ ఉంది. కార్డు లోపల లగ్గం వేడుక అని.. రాజకీయ బాగోతమేసే వారి ఇంట ఉంటుందని ప్రచురించారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో లగ్గం ఉంటుందని ఎద్దేవా చేస్తూ ప్రచురించారు.
‘బీజేపీ, బీఆర్ఎస్ లగ్గం పిలుపు.. తెలంగాణ అమరవీరుల ఆత్మఘోషతో.. ముహూర్తం 2023 సార్వత్రిక ఎన్నికల్లో.. బీఆర్ఎస్, బీజేపీల పెండ్లి, నక్షత్రం: కవితపై కరుణ నక్షత్రంలో, పిలిశెటోళ్లు.. మోదీ, కేసీఆర్, తెలంగాణ మంత్రులు’ అని వెడ్డింగ్ కార్డులో ముద్రించారు. అంతేకాకుండా, ఈ వెడ్డింగ్ కార్డులను తెలంగాణ కాంగ్రెస్ ట్విటర్ అధికారిక ఎక్స్‌లో కూడా పోస్ట్ చేశారు. ముందు నుంచి బీఆర్ఎస్ - బీజేపీ రెండు పార్టీలు ఒకటే అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.