Telangana Assembly News: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ శాసన సభ వేదికగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లుపై సోమవారం (సెప్టెంబరు 12) శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. కొత్త విద్యుత్ విధానాలను పూర్తిగా వ్యతిరేకించారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ బిల్లులు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, దయచేసి వాటిని వెనక్కి తీసుకోవాలని కోరారు. దేశంలోని పేద రైతులు, ఎస్సీ, ఎస్టీల కోసం ఈ నిర్ణయం తీసుకోవాలని అప్పీల్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లు్ల్లోని సంస్కరణలు అమలైతే ఆ శాఖ ప్రైవేటు పరం కానుందని, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల తరహాలో విద్యుత్ శాఖలోని ఉద్యోగులంతా రోడ్డున పడతారని హెచ్చరించారు.


‘‘వ్యవసాయం తన వల్ల కాదని రైతులు చేతులెత్తేసేలా కుట్ర జరుగుతోంది. ధాన్యం కొనాలని అడిగితే కేంద్ర ప్రభుత్వం కాదంటోంది. రైతులకు వ్యతిరేకమైన విధానాలు అమలు చేస్తున్నారు. వీళ్లు కాలగర్భంలో కలిసి పోతారు. భరతమాత గుండెకు గాయం అవుతోంది. అంటే వీరికి పోయే కాలం వచ్చింది. షిండేలు, బొండేలు ఎంత మంది వచ్చినా ఇక్కడ ఎవరు భయపడరు. హిట్లర్ లాంటి వాడే కాలగర్భంలో కలిసిపోయాడు.


విద్యుత్ వినియోగంలో దేశం దారుణం
‘‘రాష్ట్రాలు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నాయనే అంశంపై ఆ రాష్ట్రాల ప్రగతి ఆధారపడి ఉంటుంది. మన దేశంలో స్థాపిత విద్యుచ్ఛక్తి 4,07,178 మెగావాట్లు. బేస్ పవర్ లోడ్ 2,42,890 మెగావాట్లుగా ఉంది. ఈ దేశంలో ఇప్పటిదాకా అత్యధికంగా విద్యుత్ వినియోగించింది.. 2,10,793 మెగావాట్లు మాత్రమే. ఇటీవలే జూన్ 22న ఈ లెక్క నమోదైంది. బేస్ పవర్ లోడ్ అంటే కనీస విద్యుత్ వినియోగాన్ని కూడా మన దేశంలో వినియోగించడం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే’’ అని కేసీఆర్ చెప్పారు.


లక్షల కోట్ల ఆస్తులు ప్రవేటు పరం
ప్రస్తుతం విద్యుత్ శాఖకు దేశ వ్యాప్తంగా లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నాయి. విద్యుత్ సంస్కరణల వల్ల మొత్తం ఆస్తులు ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం అవుతాయి. డిస్ట్రిబ్యూషన్ల కంపెనీల వద్దే మీటర్లు కూడా కొనుక్కోవాలట. అదో దందా. ఈ విద్యుత్ సంస్కరణల వెనక భయంకరమైన కుట్ర ఉంది. ప్రాణాలు పోయేవరకూ తెగించి పోరాడతాం. అధికారం శాశ్వతం కాదు. ఉంటే ఉంటం లేకుంటే పోతం’’ అని కేసీఆర్ అన్నారు.


ఇవి సంస్కరణలా?


శ్రీలంకలో ఆదానీకి బొగ్గు కాంట్రాక్ట్ ఇవ్వాలని ప్రధాని మోదీనే ఒత్తిడి చేశారు. ఈ విషయం శ్రీలంకలోని విద్యుత్ శాఖ అధికారే రికార్డెడ్ గా చెప్పారు. ఆస్ట్రేలియాలోనూ బొగ్గు కాంట్రాక్ట్ లు తన మిత్రులకు ఇవ్వాలని మోదీ సిఫార్సు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో 4 వేలకు దొరికే బొగ్గును విదేశాల నుంచి కొనాలని నిబంధన పెడుతున్నారు. 10 శాతం విదేశీ బొగ్గు కొనాలని షరతు విధిస్తున్నారు. అక్కడ ధర 30 వేల దాకా ఉంటోంది. ఇది విద్యుత్ సంస్కరణా? ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిన రైతుల పొలాల్లో మీటర్లు పెట్టడం సంస్కరణ అవుతుందా? విశ్వగురువు (మోదీ) విశ్వరూపం దేశమంతా తెలియాలి.’’ అని కేసీఆర్ అన్నారు.