తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కొద్ది రోజులుగా ఆ దిశగానే ఆయన రాజకీయ వ్యూహాలు ఉంటున్నాయి. అందులో భాగంగానే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామితో సీఎం కేసీఆర్ ఆదివారం భేటీ అయ్యారు. అంతకుముందు బిహార్ వెళ్లి అక్కడ అధికారంలో ఉన్న జేడీయూ, ఆర్జేడీ నేతలను కలిశారు. అయితే, కేసీఆర్‌ను ఆదివారం కుమార స్వామి కలవడంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు.


ఆదివారం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీల నేతలను కలవడంలో లాజిక్ ఏంటని ప్రశ్నించారు. బీజేపీతో కలిసి ఉన్న వారితో కాకుండా కేసీఆర్ కాంగ్రెస్ కూటమిలో ఉన్న వారినే ఎందుకు కలుస్తున్నారో చెప్పాలని అడిగారు. కేసీఆర్ యూపీఏ భాగస్వామ్య పక్షాలను కాంగ్రెస్ కు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జగన్, చంద్రబాబు, నవీన్ పట్నాయక్, ఏక్ నాథ్ షిండే లాంటి వారిని కేసీఆర్ కలవబోరని పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ అంతర్గతంగా సహకరించుకుంటున్నాయని, సమస్యలను పక్కదారి పట్టించేందుకే మత విద్వేషాలను వారు రెచ్చగొడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. యూపీఏ కూటమి విచ్ఛిన్నానికే అని మండిపడ్డారు. ప్రధాని మోదీ సుపారీ ఇచ్చారని, ఆ ఒప్పందంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని అన్నారు.


అధికారం కోసం జరుగుతున్న కుట్రలో సామాన్య ప్రజలు నలిగిపోతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆయన వల్ల తెలంగాణ సమాజానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందని అన్నారు. దీనిని బలంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఎం కేసీఆర్‌ బీజేపీకి అనుకూలంగా మారిపోయి యూపీఏ కూటమిలోని పార్టీలను కాంగ్రెస్‌కు దూరం చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.


వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం లేఖ
తెలంగాణ వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. వీఆర్ఎలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హులైన వీఆర్ఎలకు పదోన్నతులు కల్పించడం. సొంత గ్రామాల్లో వాళ్లకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలని, సమ్మె కాలంలో, విధి నిర్వహణలో చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న వీఆర్ఎల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని రేవంత్ రెడ్డి తన లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


‘‘టీఆర్ఎస్ ప్రభుత్వంలో వీఆర్ఎల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. వారి అకాల మరణాలు, ఆత్మహత్యలు నిత్యకృత్యం కావడం బాధాకరం అన్నారు. వాళ్లతో గొడ్డు చాకిరీ చేయించుకోవడమే తప్ప, వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని. తమ సమస్యలను  పరిష్కరించావని, ఉద్యోగ భద్రత కల్పించాలని మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వీఆర్ఏలు గత 48 రోజలుగా సమ్మె చేస్తున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. అయిన మీ రాక్షస ప్రభుత్వంలో చలనం లేకపోవడం అత్యంత బాధాకరం’’ అని తన లేఖలో పేర్కొన్నారు.