Hyderabad Disproportionate Assets Case:  తెలంగాణలో అవినీతి తిమింగలాల వేటను రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ  మరింత ఉధృతం చేసింది. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్ బ్యాచు రవీందర్ ఇళ్లతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాలపై ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల  కేసులో విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సోదాలు జరిగాయి.  

Continues below advertisement

ఏసీబీ సిటీ రేంజ్-I బృందాల ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజాము నుంచే ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలోని అత్యంత విలాసవంతమైన  సుమధుర అక్రోపోలిస్ అపార్ట్‌మెంట్‌లోని రవీందర్ నివాసంతో పాటు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన మొత్తం 12 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో రంగంలోకి దిగారు. హెచ్ఎండీఏలో కీలక బాధ్యతల్లో ఉన్న ఈ అధికారి.. గత కొంతకాలంగా పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడినట్లు ఏసీబీకి పక్కా ఆధారాలు లభించాయి.

సోదాల సందర్భంగా ఏసీబీ అధికారులు భారీగా అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. నగరంలోని ఐటీ కారిడార్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన ఓపెన్ ప్లాట్లు, నివాస గృహాలు, వ్యవసాయ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఇంట్లో లభించిన భారీగా నగదు, కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు, విలాసవంతమైన కార్లు ,  వివిధ బ్యాంక్ అకౌంట్లు, లాకర్లకు సంబంధించిన వివరాలను ఏసీబీ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. 

Continues below advertisement

హెచ్ఎండీఏలో ప్లాట్ల లేఅవుట్ అనుమతులు, జోనింగ్ మార్పులు, పెద్ద పెద్ద ప్రాజెక్టుల టెండర్ల కేటాయింపుల్లో రవీందర్ తన అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆయనకున్న ఆదాయానికి, ప్రస్తుతం లభ్యమైన ఆస్తుల విలువకు పొంతన లేకపోవడంతో అధికారులు ఆస్తుల విలువను లెక్కిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ వందల కోట్ల రూపాయల పైనే ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.   

ఇటీవలి కాలంలో తెలంగాణలో బడా అధికారులను టార్గెట్ చేస్తూ ఏసీబీ వరుస దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారి నివాసాలపై దాడులు జరగడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, రవీందర్ తో పాటు ఆయన బినామీల పేరిట ఉన్న ఆస్తుల పూర్తి వివరాలను సేకరించిన అనంతరం నిందితుడిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.