ABP Desam Health Conclave 2025: ABP దేశం హెల్త్ కాన్‌క్లేవ్ 2025లో ప్రస్తుత ప్రపంచ అవసరాలకు అనుగుణంగా వైద్య విద్యను ఎలా పునరుద్ధరించాలనే దానిపై ఒక కీలకమైన చర్చ జరిగింది. వైద్య విద్యార్థులను కేవలం ఉద్యోగానికి సిద్ధంగా ఉంచడమే కాకుండా భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా ఎలా తీర్చిదిద్దాలి అనే అంశంపై  మల్లారెడ్డి విద్యా సంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతి రెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు. "ప్రపంచం మహమ్మారుల నుంచి AI పురోగతికి, వాతావరణ మార్పుల నుంచి పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల వరకు మారుతున్నప్పుడు, మనం వైద్యులకు శిక్షణ ఇచ్చే విధానం ఇకపై ఒకేలా ఉండకూడదు" అని ఆమె నొక్కి చెప్పారు.

సాంకేతికతతో కూడిన వైద్య విద్య: 

ప్రస్తుత సంప్రదాయ బోధనా పద్ధతులు పాతబడ్డాయని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), వర్చువల్ రియాలిటీ (VR) వంటి అధునాతన సాంకేతికతలను వైద్య విద్యలో విలీనం చేయడం చాలా అవసరమని డాక్టర్ ప్రీతి రెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యార్థులు MBBS పూర్తి చేయగానే ఈ సాంకేతికతలను ఉపయోగించుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండేలా  ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ మోడ్యూల్స్ ఉండాలని ఆమె సూచించారు. వైద్య విద్యను కేవలం విద్యా కేంద్రంగానే కాకుండా, పరిశోధన,  ఆవిష్కరణలకు (ఇన్నోవేషన్ సెంటర్లు) సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, 50-50 నిష్పత్తిలో అకడమిక్స్, పరిశోధన ఉండాలని ఆమె అన్నారు, ఇది విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరుస్తుందని తెలిపారు.

ఆచరణాత్మక శిక్షణ -కమ్యూనికేషన్:

వైద్యులు కేవలం సిద్ధాంత పరిజ్ఞానంతో సరిపోదని, రోగులతో వ్యవహరించే ఆచరణాత్మక అనుభవం మొదటి సంవత్సరం నుంచే అవసరమని డాక్టర్ ప్రీతి రెడ్డి పేర్కొన్నారు. ఆసుపత్రిలో వాస్తవ పరిస్థితులు, విద్యార్థులు నేర్చుకుంటున్న దానికి మధ్య పెద్ద అంతరం ఉందని ఆమె అంగీకరించారు. వైద్యులకు కమ్యూనికేషన్ నైపుణ్యం అత్యంత ముఖ్యమైనదని, రోగులతో మాట్లాడటం, వారి హిస్టరీని పూర్తిగా తెలుసుకోవడం, పరీక్షించడం వంటివి ముఖ్యమని ఆమె నొక్కిచెప్పారు, కేవలం పరికరాలపై ఆధారపడటం సరికాదని అన్నారు. సిమ్యులేషన్ ల్యాబ్‌లలో శిక్షణ పొంది, ఆ తర్వాత రోగులను చూడటం ద్వారా వారు మరింత సుశిక్షితులు అవుతారని ఆమె తెలిపారు.

ప్రజా ఆరోగ్యం -సానుభూతి ప్రాముఖ్యత: 

ఇంటర్న్‌షిప్ రొటేషన్లలో నివారణ, ప్రజా ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, PHC (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) లలో తప్పనిసరి పోస్టింగ్‌లు ఉండాలని డాక్టర్ ప్రీతి రెడ్డి సూచించారు. ఇది విద్యార్థులకు సమాజ అవసరాలను అర్థం చేసుకోవడానికి,  మెరుగైన వైద్యులుగా మారడానికి సహాయపడుతుంది. వైద్యులకు సానుభూతి (ఎంపతీ), దయ, నీతి (ఎథిక్స్) ఉండటం చాలా ముఖ్యమని, వారు యంత్రాలతో కాదు, ప్రాణాలతో వ్యవహరిస్తారని గుర్తు చేశారు. "వైద్యులకు నైపుణ్యాలు ఉన్నా, సోల్‌ లేకపోతే పూర్తి వైద్యులు కాలేరు" అని ఆమె అన్నారు.

విద్యార్థుల మానసిక ఆరోగ్యం ,భవిష్యత్ సన్నద్ధత: 

వైద్య విద్యార్థులు ఒత్తిడికి గురవకుండా, తమ వృత్తిని ఆసక్తితో ఎంచుకోవాలని ప్రీతిరెడ్డి సూచించారు. వైద్య విద్యా సంస్థలు సహాయకారిగా ఉండాలి, క్రమశిక్షణతో కూడిన, విశ్రాంతి వాతావరణాన్ని కల్పించాలి, పీర్ కౌన్సిలింగ్ వంటివి అందించాలి అని అన్నారు. భవిష్యత్ సిద్ధంగా ఉండే MBBS గ్రాడ్యుయేట్ అంటే సాంకేతికంగా నిష్ణాతులు, నైతికంగా ఉన్నతమైనవారు, దయగలవారు, సమాజం పట్ల శ్రద్ధ ఉన్నవారు అని డాక్టర్ ప్రీతి రెడ్డి నిర్వచించారు. భారతదేశంలో విద్యా వ్యవస్థ వృద్ధి చెందుతున్న తీరు, NEP 2020 వంటి అంశాలు విదేశాలకు వెళ్లే ధోరణిని తిప్పికొడతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కృషి, క్రమశిక్షణతో కూడిన పద్ధతిలో సరైన దిశలో పని చేయడం విజయానికి కీలకం అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి చెప్పిన స్ఫూర్తిదాయక మాటలైన "పాలు అమ్మినా, పూలు అమ్మినా"కి టెక్నాలజీని జోడించి వివరించారు. ఈ సంస్కరణలన్నీ భారతదేశ వైద్యులను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు దోహదపడతాయన్నారు.