ABP Desam Health Conclave 2025: ABP దేశం హెల్త్ కాన్‌క్లేవ్ 2025లో రెనాలిక్స్ హెల్త్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సుబోధ్ గుప్తా కీలక ప్రసంగం చేశారు. స్క్రీనింగ్ నుంచి సంరక్షణ వరకు ఒక సమగ్ర మూత్రపిండ నెట్‌వర్క్‌ను సృష్టించడంపై ఆయన మాట్లాడారు. భారతదేశంలో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (CKD) చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి తమ కంపెనీ చేస్తున్న కృషిని వివరించారు. దేశంలో డయాలసిస్ చికిత్సను మరింత సరసమైనదిగా, అందుబాటులోకి తీసుకురావడమే రెనాలిక్స్ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

భారతదేశంలో CKD సమస్య:

భారతదేశంలో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (CKD) ఒక పెద్ద ఆందోళన కలిగించే ఆరోగ్య సమస్యగా మారుతోందని సుబోధ్‌ అభిప్రాయపడ్డారు. కిడ్నీ చికిత్స అవసరం చాలా పరిమితంగా ఉందని అందుకు తగ్గట్టు సౌకర్యాలకు భారీ కొరత ఉందని తెలిపారు. గుప్తా ఇచ్చిన వివరాల ప్రకారం "దేశంలో సుమారు 20 మిలియన్ల మంది రోగులకు డయాలసిస్ చికిత్స అవసరం ఉంది. అయితే ప్రస్తుత దేశంలో ఉన్న మౌలిక సదుపాయాలతో కేవలం 2.5 మిలియన్ల మంది రోగులకు మాత్రమే క్రమం తప్పకుండా డయాలసిస్ అందిస్తున్నాం. ఇది భారీ అవసరాల అంతరాన్ని సూచిస్తుంది. దేశానికి దాదాపు 2.5 లక్షల డయాలసిస్ యంత్రాలు అవసరం కాగా, ప్రస్తుతం అన్ని కంపెనీలు కలిపి కేవలం 54,000 యంత్రాలు మాత్రమే పని చేస్తున్నాయి. ఈ అంతరానికి ఒక ప్రధాన కారణం దిగుమతి చేసుకున్న యంత్రాలపై మన దేశం ఎక్కువగా ఆధారపడటమే" అని ఆయన అభిప్రాయపడ్డారు.

రెనాలిక్స్ స్వదేశీ పరిష్కారం

ఈ గణనీయమైన అంతరాన్ని పూడ్చడానికి రెనాలిక్స్ ఒక వినూత్న పరిష్కారంతో ముందుకు వచ్చిందని తెలిపారు సుబోధ్‌. ""మేము భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ డయాలసిస్ మెషీన్‌ను అభివృద్ధి చేశాము"అని తెలిపారు. ఇది కేవలం అసెంబుల్ చేసిన మోడల్ కాదని, భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన యంత్రమని ఆయన నొక్కిచెప్పారు. ఈ యంత్రంలో 80% కంటే ఎక్కువ భాగాలు స్థానికంగా లభిస్తాయి, ఈ సంవత్సరం చివరి నాటికి వందశాతం స్వదేశీకరణ సాధించే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. "ఇది చాలా క్లిష్టమైన యంత్రం అయినప్పటికీ రెనాలిక్స్ బృందం దీనిని సాధించగలిగింది. ఈ మెషీన్ యూరోపియన్ అథారిటీచే  C-సర్టిఫైడ్ చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా లభించే ఏ ఇతర యంత్రానికి తీసిపోని విధంగా ఉంటుంది. త్వరలో ఇది భారతదేశంలో వాణిజ్యపరంగా అందుబాటులోకి రానుంది, ఉత్పత్తి లైసెన్స్ పొందిన తర్వాత కొన్ని నెలల్లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది." అని వెల్లడించారు. 

సరసమైన ధరల కోసం ప్రయత్నం

డయాలసిస్ సేవలను రోగులకు మరింత చేరువ చేయడమే రెనాలిక్స్ ప్రధాన లక్ష్యంగా సుబోధ్‌ పేర్కొన్నారు. "రవాణా సమస్యల కారణంగా చాలా మంది రోగులు డయాలసిస్ కేంద్రానికి చేరుకోవడానికి చాలా సమయం పడుతోంది. దీని కారణంగానే మొదటి సంవత్సరంలోనే డయాలసిస్ చికిత్స నుంచి చాలా మంది తప్పుకుంటున్నారు. ప్రభుత్వాలు ఉచిత డయాలసిస్ సెషన్లను అందిస్తున్నప్పటికీ, ఈ లాజిస్టిక్స్ సమస్యల కారణంగా డ్రాపౌట్‌లు ఎక్కువగా ఉన్నాయి. రెనాలిక్స్ డయాలసిస్ కేంద్రాలను రోగుల ఇంటికి దగ్గరగా తీసుకురావడం ద్వారా రవాణా ఖర్చులు, సమయాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తోంది. ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, రెనాలిక్స్ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో (NGOలు) కలిసి పనిచేస్తోంది. భారతదేశంలో ఒక డయాలసిస్ ప్రక్రియకు దాదాపు 80 డాలర్లు ఖర్చు అవుతుంది, ఇది ప్రపంచవ్యాప్తంగా 250 డాలర్ల నుంచి 300 డాలర్ల వరకు ఉంటుంది. అయితే, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు నెలకు అవసరమయ్యే 12 సెషన్ల (వారానికి మూడు) ఖర్చు ఇప్పటికీ పెద్ద ఆర్థిక భారం. ఈ భారాన్ని తగ్గించడానికి,  ప్రీమియంలను తగ్గించడానికి రెనాలిక్స్ బీమా కంపెనీలతో కూడా చురుకుగా కలిసి పనిచేస్తోంది, CKD స్టేజ్ 5 రోగులకు డయాలసిస్ ఒక ప్రాథమిక అవసరం అని వారికి వివరిస్తోంది." అని తెలిపారు సుబోధ్‌. 

ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ AI డయాలసిస్ మెషీన్ & నివారణ 

రెనాలిక్స్ మెషీన్ ఆవిష్కరణలపై కూడా సుబోధ్ వివరణాత్మకమైన వివరాలు అందించారు. "అత్యంత వినూత్న లక్షణాల్లో ఒకటి దాని'స్మార్ట్ AI డయాలసిస్ మెషీన్' సామర్థ్యం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి రిమోట్‌గా పర్యవేక్షించదగిన AI డయాలసిస్ మెషీన్. భారతదేశంలో కేవలం 3,300 మంది నెఫ్రాలజిస్టులు మాత్రమే ఉన్నారు, వారు ఎక్కువగా మెట్రో నగరాల్లోనే కేంద్రీకృతమై ఉన్నారు. ఈ సాంకేతికతతో, నెఫ్రాలజిస్టులు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా రియల్‌ టైంలో డయాలసిస్‌ను పర్యవేక్షించవచ్చు. సమస్యలు తలెత్తితే తక్షణమే జోక్యం చేసుకోవచ్చు, డయాలసిస్ టెక్నీషియన్‌లకు సహాయం చేయవచ్చు. ఇది మారుమూల ప్రాంతాలలో కూడా నిరంతర సంరక్షణ నిర్ధారిస్తుంది. రెనాలిక్స్ CKD ప్రాథమిక స్క్రీనింగ్‌లో కూడా సహాయపడుతుంది; వ్యాధి త్వరగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి, ముందస్తుగా గుర్తించడానికి ఒక యాప్‌ను అభివృద్ధి చేసింది. ముందస్తు జోక్యం వ్యాధి పురోగతిని ఆలస్యం చేస్తుంది." అని పేర్కొన్నారు. సుబోధ్‌ గుప్తా ప్రకారం CKD ప్రధానంగా అనియంత్రిత రక్తపోటు (hypertension) అనియంత్రిత మధుమేహం (diabetes) వల్ల సంభవిస్తుంది. ఇవి మూత్రపిండాలపై ప్రభావం చూపుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని మెరుగుపరచుకోవడం, ఈ పరిస్థితులను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం అని ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు.

సుమారు పదకొండు సంవత్సరాల కృషి, పరిశోధనల తర్వాత, రెనాలిక్స్ ఈ స్వదేశీ ఆవిష్కరణ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల సంరక్షణలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని సుబోధ్‌ భావిస్తున్నారు. ఇప్పటికే భారతదేశం వెలుపల ఉన్న అనేక దేశాల నుంచి వేల మంది విచారణ చేస్తున్నారని సుబోధ్‌ గుప్తా వెల్లడించారు. ఈ ప్రపంచ స్థాయి అత్యాధునిక ఉత్పత్తి చాలా మంది భారతీయులకు, అంతర్జాతీయ రోగులకు ఆశాదీపంగా మారుతుందన్నారు.