Telangana MLA Disqualification Case: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో విచారణ ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. బీఆర్‌ఎస్‌ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకునేలా ఆదేశించాలని బీఆర్‌ఎస్ పిటిషన్ వేసింది. దీనిపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ కేసును అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ అడ్వకేట్‌ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తే బీఆర్‌ఎస్ తరఫున ఆర్యమా సుందరం వాదించారు. 

వాదనలు వినిపించే సందర్భంలో ముఖ్యమంత్రిపై, స్పీకర్ ఛాంబర్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 8 వారాల్లో నిర్ణయం తీసుకునేలా తీర్పు ఇవ్వాలని బీఆర్‌ఎస్ అడ్వకేట్ విజ్ఞప్తి చేస్తే... అలా స్పీకర్‌ను డిక్టేట్ చేసేలా తీర్పులు లేవని సింఘ్వీ తెలిపారు. దీంతో బెంచ్ కలుగుజేసుకొని అసలు రీజనబుల్ టైం అంటే ఎంత అని ప్రశ్నించింది. 2028 జనవరి-ఫిబ్రవరి వరకు ఎదురు చూడాలా అని నిలదీసింది. న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని తాము ఆశిస్తున్నామని అన్నారు. 

వాస్తవరంగా ఈ పిటిషన్లపై ఓ నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలని సింఘ్వీని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఆరు నెలలు టైం కావాలని ఆయన సమాధానం ఇచ్చారు. ఇప్పటికే ఏడాది దాటిందని ఇంకా మరో ఆరునెలలు ఎలా అడుగుతారని జస్టిస్‌ గవాయ్‌ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికీ కోర్టులు జోక్యం చేసుకునే సమయం రాలేదా అని ప్రశ్నించారు.  

నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌పై ఒత్తిడి తెస్తున్నారని సంఘ్వీ అభిప్రాయపడ్డారు. అదే టైంలో మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ను బీఆర్‌ఎస్‌ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఉపఎన్నికలు రాబోవని సీఎం ఎలా చెబుతారని వివరించారు. ఇలా మాట్లడిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందని ఎలా భావించాలని ఆందోళన వ్యక్తం చేశారు.  

సీఎం చేసిన కామెంట్స్‌ తెలుసుకున్న జస్టిస్‌ గవాయ్‌ ఘాటుగా స్పందించారు. సీఎంకు స్వీయనియంత్రణ లేదా అని ప్రశ్నించారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటన జరిగిందని గుర్తు చేశారు. ఇంతలో ప్రతిపక్షం గురించి సింఘ్వీ మాట్లాడుతుంటే అవన్నీ అప్రస్తుతమని అన్నారు గవాయ్‌. మళ్లీ ఇలాంటివి రిపీట్ అయితే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. స్పీకర్‌పై ఎవరూ ఒత్తిడి తీసుకురావం లేదని సింగిల్ బెంచ్ తీర్పు తర్వాత చర్యలు తీసుకొని ఉంటే సమస్య ఇక్కడి వరకు వచ్చేది కాదన్నారు. అనంతరం వాదనలు ముగిసినట్టు ప్రకటించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది. 

తెలంగాణలో కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కండువాలు మార్చేశారని బీఆర్‌ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వారిపై అనర్హత వేటు వేయాలని అభ్యర్థించింది. స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో విషయాన్ని కోర్టుకు తీసుకెళ్లింది. అనర్హత వేటు వేసేలా ఆదేశాలు జారీ చేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక్కడ కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.