అత్యంత ప్రతిష్టాత్మంగా ఏర్పాటు చేసిన రామనుజుల విగ్రహం ఇండియన్ బుక్‌ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. 216 అడుగుల ఎత్తుతో నిర్మించిన సమతా మూర్తి విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా గుర్తిస్తూ ఇండియన్ బుక్ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రకటన జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోది ఈ రామాజుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. 


ఆరోరోజు అత్యంత వైభవంగా సహస్రాబ్ది సమారోహం


రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఆరోరోజు శ్రీరామనగరం భక్తజన సంద్రమైంది. జయ జయ రామానుజ అంటూ జయజయ ధ్వానాలు చేస్తూ.. జై శ్రీరామ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు భక్తులు. 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకుని తన్మయత్వంతో మైమరిచిపోయారు. 


యాగశాలలో దృష్టిదోషాల నివారణకు వైయ్యూహికేష్టి యాగాన్ని నిర్వహించారు. 5వేల మంది రుత్విజులు వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా లక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. 114 యాగశాలల్లో 1035 హోమ కుండాల్లో రుత్విజుల చతుర్వేద పారాయణల మధ్య ఘనంగా జరిగింది.


అనంతరం ప్రవచన మండపంలో వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మజీవనానికి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ జరిగింది. త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. భక్తులకు శ్రీకృష్ణపెరుమాళ్ డాలర్ ను ఇచ్చి పూజలను జరిపించారు.  


అనంతరం 108 దివ్యదేశాల్లోని 33 దివ్యదేశ ఆలయాలకు ప్రాణప్రతిష్ఠ శాస్త్రోత్తంగా జరిగింది. త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామీజీ యాగశాల నుంచి రుత్విజులతో కలిసి సామూహిక వేద పారాయణం చేస్తూ.. సమతామూర్తి ప్రాంగణంలో ఉన్న దివ్యదేశ ఆలయాలలోని ౩౩ ప్రధాన ఆలయాలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమంలో వేదపండితులతోపాటు మైహోంగ్రూప్‌ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. 


ప్రాణప్రతిష్ఠ చేసిన ౩౩ ఆలయాలు :
శ్రీరంగం, ఉరైయూర్, తిరుప్పళ్లంబూదంగుడి, తిరుఅన్బిల్‌, తిరుకరంబనూర్, తిరువెళ్లరై, తిరుప్పేర్ నగర్, తిరువళందూర్, తిరుక్కుడందై, తిరుక్కుండియార్, తిరునాగై, నందిపుర విణ్ణగరం, తిరువిందళూరు, తిరుచ్చిత్తరకూడమ్‌, మణిమాడక్కోయల్, తిరుమాలిరుంసోలై, తిరుక్కోటియూర్, తిరుప్పుల్లాణి, తిరువాట్లూరు, ఆళ్వార్‌ తిరునగరి, తిరుక్కోళూరు, తిరుప్పులియార్, తిరువల్లవాళ్, తిరువహీంద్రపురం, అష్టభుజం, నీలాత్తింగళ్‌ మణ్ణమ్‌, పవళవణ్ణం, తిరుప్పల్‌కుళి, తిరువళ్లూర్, తిరునీర్‌మలై, అయోధ్య, తిరుప్పాల్‌ కడల్, పరమపదం.


ఆలయాల ప్రాణ ప్రతిష్ఠ జరుతుండగా.. శ్రీరామనగరంలోని యాగశాలలో శ్రీరామ పరివార దేవతలకు పూజలు నిర్వహించారు. లక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. మరోవైపు 126 అడుగుల సమతామూర్తిని వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు.  


ప్రవచన మండపంలో రాజగోపాలాచార్యులు, సుబ్రహ్మణ్యేశ్వరశర్మ, ప్రొ.కె.జయరామిరెడ్డి, ప్రొ.ఐ.నరసింహన్, ప్రొ.పురుషోత్తం, జానకమ్మ, ప్రొ.కిషన్‌ రావుతోపాటు పలువురు పండితులు శ్రీరామానుజ వైభవంపై ప్రవచనాలు అందించారు. అనంతరం శ్రీశ్రీ అకాడమీ వారి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. శైలజ గానం, సురభి శారద గానం అలరించాయి. జయప్రద రామ్మూర్తి వేణుగాన వినోదం శ్రోతలను అలరించింది. విష్ణుసహస్రనామంపై అవదాన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ పర్యవేక్షణలో విష్ణు సహస్రనామ పారాయణం ఘనంగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శశాంక సుబ్రహ్మణ్యం, రాకేష్‌ చౌరాసియా వేణుగాన ప్రవాహం జుగల్బందీ భక్తులను అలరించింది.