శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి సాత్విక్‌ క్లాసులోనే ఆత్మహత్య చేసుకోవడం తీవ్రమైన దుమారం రేపుతోంది. విద్యార్థి చనిపోయిన వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు. సాత్విక్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో సెక్షన్ 305 కింద కేసు నమోదు అయింది. ఎఫ్‌ఐఆర్‌లో కాలేజీ క్యాంపస్ సిబ్బంది కృష్ణారెడ్డి, ఆచార్య, హాస్టల్ వార్డెన్ నరేష్ పేర్లను చేర్చారు.


సాత్విక్ ఆత్మహత్య చేసుకోవడంపై అతని తల్లిదండ్రులు స్పందించారు. తమ కుమారుడు కాలేజీ సిబ్బంది ఒత్తిడి వల్లే చనిపోయాడని ఆరోపించారు. గతంలో లెక్చరర్స్ కొట్టడం వల్ల దాదాపు 15 రోజులు ఆస్పత్రిలోనే ఉన్నాడని చెప్పారు. అందుకని సాత్విక్ ను ఏమీ అనొద్దని, అతనిపై ఒత్తిడి పెట్టవద్దని లెక్చరర్లకు చెప్పామని చెప్పారు. అయినా మానసిక ఒత్తిడికి గురి చేయడం వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు వాపోయారు. 


కాలేజీ ఎదుట కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల ఆందోళన
శ్రీచైతన్య కాలేజీ ముందు ఆందోళనకు దిగిన క్రమంలో సాత్విక్ తల్లి కళ్లు తిరిగి పడిపోయారు. సాత్విక్ మృతికి కారణమైన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యంతో మాట్లాడిస్తామని పోలీసులు సాత్విక్ తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 


పట్టించుకోని కాలేజీ సిబ్బంది?
హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి 10:30 సమయంలో సాత్విక్‌ అనే విద్యార్థి తరగతి గదిలోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే కళాశాలలో పెట్టే ఒత్తిడి వల్లే అతడు చనిపోయినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. అంతేకాకుండా అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్తే.. కనీసం ఆసుపత్రికి కూడా సిబ్బంది తరలించలేదని వివరించారు. దీంతో విద్యార్థులంతా కలిసి ఓ వాహనం లిఫ్టు అడిగి మరీ అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. కానీ ఆసుపత్రికి తరలించే లోపే సాత్విక్ చనిపోయాడని.. వివరించారు. పోలీసులు, సాత్విక్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు సాత్విక్ మృతదేహాన్ని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


అంతా వెళ్లిపోయినా క్లాస్ రూంలోనే సాత్విక్
గత రాత్రి స్టడీ అవర్ పూర్తి అయిన తర్వాత మిగిలిన విద్యార్థులు పైన ఉన్న హాస్టల్ గదులకు వెళ్లగా.. సాత్విక్ మాత్రం క్లాస్‌రూంలోనే ఉండిపోయాడు. కొద్దిసేపటికి అక్కడే ఉన్న ఓ నైలాన్ తాడుతో సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికీ సాత్విక్ గదికి రాకపోవడతో తోటి విద్యార్థులు క్లాస్‌ రూంకు వచ్చి చూడగా అప్పటికే సాత్విక్ ఉరికి వేలాడుతున్నాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న స్థితిలో వెంటనే హాస్టల్ వార్డెన్‌‌కు సమాచారం ఇచ్చినప్పటికీ అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సాత్విక్‌‌ను ఆస్పత్రికి తరలించకపోగా క్లాస్‌రూంకు లాక్‌ చేసుకుని వెళ్లిపోయాడని విద్యార్థులు తెలిపారు. 


వెంటనే వార్డెన్ స్పందించి ఉంటే సాత్విక్ బతికేవాడని అంటున్నారు. క్లాస్ డోర్ ఓపెన్ చేయగా అప్పటి కూడా సాత్విక్ కొన ఊపిరితో ఉన్నాడు. వార్డెన్ సహకరించకపోవడంతో చివరకు విద్యార్థులే సాత్వి‌క్‌ను లిఫ్టు అడిగి ఓ బైకర్‌ సహాయంతో ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే సాత్విక్ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సాత్విక్ చనిపోయాడని విద్యార్థులు ఆరోపించారు.


మార్కులు ఎక్కువ స్కోర్ చేయాలని టార్చర్


"మాకు మార్కులు ఎక్కువ రావాలని కాలేజీ వాళ్లు ఎక్కువ టార్చర్ చేస్తున్నారు. అది తట్టుకోలేక వాడు అలా చేస్కున్నడు. ఒత్తిడి భరించలేక వాడు మాతో కూడా మాట్లాడట్లేదు. దీంతోనే నిన్న రాత్రి పదిన్నరకు సూసైడ్ చేస్కున్నడు." - షణ్ముఖ్, విద్యార్థి