Telangana Budget 2023: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై బీజేపీ ఎంపీ సోయం బాపూరావ్ స్పందించారు. ఇది పూర్తిగా పేద, మధ్య తరగతి వర్గాలకు వ్యతిరేక బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. దళితబంధు తరహాలో గిరిజనులకు గిరిజన బంధు పేరిట, నిరుద్యోగులకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తానన్నారని.. కానీ దాని గురించి ఈ బడ్జెట్లో ప్రస్తావించలేదని గుర్తుచేశారు. ఆదివాసీ గిరిజనులకు తీరని ద్రోహం చేసిన బడ్జెట్ ఇది అని వివరించారు. పోడు భూములకు త్వరలో పట్టాలు ఇస్తానని ఆరేళ్లుగా ఊరిస్తున్నావే కానీ ఈ బడ్జెట్ లో ఎందుకు చెప్పలేదన్నారు. గిరిజన బంధు పథకం గురించి ఆశలు పెట్టుకున్న సోదరులంతా మోసపోయారని తెలిపారు. ఆదాయపు పన్ను, ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారానే సర్కారు నడుస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులకు నెలకు 3 వేల భృతి ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకూ ఎందకు ఆ ఊసెత్తలేదని ఫైర్ అయ్యారు. నిరుద్యోగులను మోసం చేసేది, దగా చేస్తున్నది కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు.
మీకు చేతగాదని చెప్తే మేమే కేంద్రాన్ని ఒప్పిస్తాం..
ఖాళీ స్థలం ఉంటే ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షలు ఇస్తానన్న హరీష్ రావు.. ఈ బడ్జెట్లో 3 లక్షలే ఇస్తానని చెప్పి ఎందుకు మోసం చేశారని సోయం బాపూరావు ప్రశ్నించారు. బీసీ కులాలకు తీరని ద్రోహం చేసిన బడ్జెట్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. రైల్వే బడ్జెట్ లో 50 శాతం నిధులు మేమే భరిస్తామని.. మంత్రులు ఇంద్రకరణ్, జోగు రామన్న, ఎంపీ నగేష్ 2017లో అప్పటి కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును కలిశారని గుర్తు చేశారు. ఒక రూపాయి కూడా కౌంటర్ గ్యారెంటీ ఇవ్వకపోవడం వల్లే.. రైల్వే బోర్డుకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం వల్లే ఆదిలాబాద్, ఆర్మూర్ లైన్ కు జాప్యం జరిగందన్నారు. మీకు చేతగాదని డబ్బులు ఇవ్వలేమని చెప్తే... మేమే కేంద్రాన్ని ఒప్పించి రైల్వే లైన్ తెప్పిస్తామని అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపిన కేసీఆర్ ప్రభుత్వం బడ్జెట్ ఇదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలను తీవ్రంగా నిరాశ పరిచిందన్నారు.
ఆదిలాబాద్ - ఆర్మూర్ రైల్వే లైన్ కోసం కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ
నెలరోజుల క్రితమే ఎంపీ సోయం బాపూరావు కేంద్రమంత్రిని కలిశారు. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఆదిలాబాద్ - ఆర్మూర్ రైల్వే లైన్ పనుల మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి ముందుకు రావడంలేదని, కేంద్ర రైల్వే శాఖ పూర్తిగా బడ్జెట్ నిధులను భరించి ఈ పనులను పూర్తి చేయాలని ఎంపీ సోయం బాపూరావు కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి పలు రైల్వే సమస్యలను విన్నవించారు. ముఖ్యంగా ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ మంజూరి కోసం 50 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని గతంలో లేఖ ఇచ్చిన తెలంగాణ మంత్రులు ప్రస్తుతం దాని ఊసెత్తడం లేదని రానున్న బడ్జెట్లో కేంద్రమే పూర్తిగా భరించే విధంగా చొరవ చూపాలని ఎంపీ కోరారు.