South Central Railway : పార్శిల్ బుకింగ్‌తో పాటు డెలివరీని సులభతరం చేసే లక్ష్యంతో, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఒక వినూత్నమైన అప్లికేషన్ ఆధారిత పార్శిల్ లాజిస్టిక్స్ సేవను అభివృద్ధి చేస్తోంది. ఫస్ట్ మైల్ (వస్తువులను తీసుకోవడం), లాస్ట్ మైల్ (డెలివరీ) సేవలను సులభతరంగా అందించడం దీని ముఖ్య ఉద్దేశం. రైలు ద్వారా తమ పార్శిల్స్‌ను బుక్ చేయాలనుకునే వారికి డోర్-టు-డోర్ సేవను అందించాలనే లక్ష్యంతో, దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాద్ డివిజన్ అధికారులు ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీని అనుసంధానించే ఒక అప్లికేషన్‌కు రూపకల్పన చేస్తున్నారు.
పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ డివిజన్ పరిధిలో సేవలు
పైన చెప్పిన సేవలను అందించే ఈ అప్లికేషన్‌ను మొదటగా జోన్‌లోని హైదరాబాద్ డివిజన్ పరిధిలో పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురానున్నారు. రైల్వేతో భాగస్వామ్యం వహించడానికి ఆసక్తి ఉన్న ఏజెన్సీలను SCR లాజిస్టిక్స్/ఫ్లీట్ సేవలను అందించడానికి ఆహ్వానిస్తుంది. రైల్వే ద్వారా రవాణా (మిడ్ మైల్)తో ఫస్ట్ మైల్ (పికప్), లాస్ట్ మైల్ (డెలివరీ) సేవలను అనుసంధానించడానికి లాజిస్టిక్స్ భాగస్వాములు అవసరం. ఇందులో భాగస్వాములు అవడానికి ఆసక్తి ఉన్న సంస్థలు చర్చలు జరిపేందుకు, సేవలు అందించేందుకు చేసుకోవాల్సిన రిజిస్ట్రేషన్ ప్రక్రియకు హైదరాబాద్ డివిజన్, దక్షిణ మధ్య రైల్వే కమర్షియల్ వింగ్‌ను మెయిల్ ద్వారా లేదా వ్యక్తిగతంగా సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇంటి నుంచే దేశం నలుమూలకు పార్శిల్స్ రవాణాయే లక్ష్యం
ఇంటి నుంచే వినియోగదారుడు తమ పార్శిల్స్‌ను దేశం నలుమూలలకు పంపేందుకు వీలుగా సమగ్ర డిజిటల్ పరిష్కారం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఫస్ట్ మైల్, మిడ్ మైల్ (రైల్వే రవాణా), లాస్ట్ మైల్ సేవలను ఒకే వేదికపైకి తీసుకురావడం ప్రధాన లక్ష్యం. దీని ద్వారా వినియోగదారులు తమ పార్శిల్ రవాణా చాలా సులభంగా, వేగంగా, పారదర్శకంగా పంపడానికి వీలు అవుతుంది. అంతేకాకుండా, వినియోగదారుడు తమ పార్శిల్ బుకింగ్ చేసేందుకు, ఆ తర్వాత పార్శిల్ ట్రాకింగ్ చేసేందుకు రైల్ పార్శిల్ యాప్ వన్-స్టాప్ ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇంటి నుంచే దేశం చివరి ప్రాంతానికి కూడా సులువుగా పార్శిల్ చేరవేసే దిశగా వినియోగదారులకు ఇది ఉపయోగపడుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు.