ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబరు 1న తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చి ప్రధాని మోదీ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే, ముందస్తుగా ఖరారైన షెడ్యూల్‌లో కాకుండా ప్రధాని షెడ్యూల్‌లో చిన్న మార్పులు జరిగాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు రావాల్సి ఉంది. కానీ, ఆ ప్రత్యేక విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మళ్లించనున్నారు. అయితే, ఇందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. అక్టోబర్ 1న మధ్యాహ్నం 1:30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మోదీ ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి 1:35 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ‌లో మహబూబ్‌ నగర్‌కు బయలుదేరనున్నారు.


2:10 గంటలకు మహబూబ్‌ నగర్ హెలిపాడ్ వద్దకు మోదీ చేరుకుంటారు. 2:15 గంటల నుంచి 2:50 వరకు మహబూబ్‌ నగర్‌లోనే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తర్వాత ఓ బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ వేదికకు మోదీ రానున్నారు. 4 గంటల వరకు బహిరంగ సభ వద్దే నరేంద్ర మోదీ ఉంటారు. ప్రసంగం ముగించిన తర్వాత 4:10 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి అదే ప్రత్యేక హెలికాప్టర్‌ లో శంషాబాద్ ఎయిర్‌ పోర్టుకు బయలుదేరతారు. 4:45 శంషాబాద్ ఎయిర్‌ పోర్టుకు ప్రధాని చేరుకొని 4:50 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో మోదీ తిరిగి ఢిల్లీ వెళ్ళనున్నారు.