హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కేసీఆర్‌ను విచారిస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇదివరకే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR)కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎర్రవల్లిలోని ఫాం హౌస్‌ నుంచి హైదరాబాద్‌కు రాగా, నందినగర్ లోని నివాసంలో ఆరుగురు సిట్ అధికారులు కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు.

నందినగర్ నివాసంలో విచారణబంజారాహిల్స్ నందినగర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. అంతకుముందు ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి కేసీఆర్ నందినగర్ లోని తన నివాసానికి చేరుకున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని సిట్ అధికారులు కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలపై అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించి, ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్నారు. ఈ విచారణ ప్రక్రియ మొత్తాన్ని అధికారులు వీడియో రికార్డింగ్ చేసే అవకాశం ఉంది.

నోటీసులపై అభ్యంతరం.. విచారణకు సహకారంసిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై కేసీఆర్ తొలుత అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వయస్సు దృష్ట్యా తాను నివాసం ఉంటున్న ఎర్రవల్లిలోనే విచారించాలని కోరారు. అయితే, అధికారులు నిరాకరించడంతో నందినగర్ నివాసంలో విచారణకు ఆయన అంగీకరించారు. కేసీఆర్ ఏసీపీకి రాసిన లేఖలో "నోటీసులు జారీ చేసిన పద్ధతి రాజ్యాంగ విరుద్ధం, కానీ బాధ్యతాయుతమైన పౌరుడిగా విచారణకు సహకరిస్తాను" అని మాజీ సీఎం పేర్కొన్నారు. ఈ సమయంలో కేటీఆర్, హరీష్ రావు సహా కీలక నేతలు నందినగర్ నివాసంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. అయితే చివరి నిమిషంలో కేటీఆర్ ఒక్కడిని మాత్రమే ఇంట్లో ఉండే అవకాశం ఇచ్చారు. సొంత కుటుంబసభ్యుడు కావడంతో కేటీఆర్ ఇంట్లోనే ఉండగా.. పర్మిషన్ ఇవ్వకపోవడంతో హరీష్ బటయకు వెళ్లిపోయారు.

బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనలుమరోవైపు, కేసీఆర్ విచారణను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతున్నారు. హైదరాబాద్‌లో విచారణ జరుగుతున్న నందినగర్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.