హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు  సిట్ విచారణపై సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. సిట్ విచారణ సమయంలో ప్రతీ అరగంటకోసారి ఫోన్ రావడం,  సిట్ అధికారుల బయటకు వెళ్లడం, ఫోన్ మాట్లడి మళ్లీరావడం.. ఇలా ఎవరో ప్రభావితం చేస్తున్నట్లుగా సిట్ విచారణ జరిగిందంటూ తీవ్ర దుమారం రేపారు. హరీష్ వ్యాఖ్యలకు కౌంటర్ గా సిట్ విచారణపై పత్రికా ప్రకటన విడుదల చేశారు సీపీ సజ్జనార్. సిట్ విచారణ, హరీష్ రావు వ్యాఖ్యలపై ప్రకటనలో సజ్జనార్ ఏమన్నారంటే..

Continues below advertisement

హరీష్ రావు రిక్వెస్ట్ మేరకు ముగిసిన సిట్ విచారణ..

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు (క్రైమ్ నం. 243/2024) దర్యాప్తులో భాగంగా, సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్ రావును 2026 జనవరి 20న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు పిలిపించి ప్రశ్నించడం జరిగింది. సాయంత్రం తన కుమారుడికి విమాన ప్రయాణం ఉన్నందున, హరీష్ రావు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), ఈ రోజుకు విచారణను ముగించి ఆయన వెళ్ళేందుకు అనుమతించింది.

Continues below advertisement

ఈ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించరాదని, ప్రభావితం చేయరాదని లేదా జోక్యం చేసుకోరాదని ఆయనకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అవసరమైతే తదుపరి విచారణ నిమిత్తం మళ్లీ పిలుస్తామని తెలియజేశాం.

ఈ సందర్భంగా ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. ఈరోజు హరీష్ రావును విచారించింది కేవలం క్రైమ్ నం. 243/2024 (ఫోన్ ట్యాపింగ్ కేసు)కు సంబంధించి మాత్రమే. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా, చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం, వారిపై నిఘా ఉంచడం వంటి తీవ్రమైన ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతోంది.

ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో 10.03.2024 నుంచి సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే కొంతమంది నిందితులపై ప్రధాన ఛార్జిషీటు కూడా దాఖలు చేయడం జరిగింది. కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. కావున, గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హరీష్ రావును విచారిస్తున్నారంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని, అటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ పేరుతో ఈ ప్రకటన విడుదల చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. 

8 గంటలపాటు జరిగిన సిట్ విచారణపై హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే సీపీ సజ్జనార్ పేరుతో పత్రికా ప్రకటన రావడం, విచారణలో వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేయడం ఆశక్తిగా మారింది. సిట్ విచారణ పేరుతో లోపల జరిగిందేమి లేదని, అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని, పదే పదే ఫోన్లు రావడంతో బైటకు వెళ్తున్నారని హరీష్ రావు ఆరోపించడంతో పత్రికా ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు సిట్ అధికారులు.