Revanth Reddy at WEF: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటెలిజెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బిల్డింగ్ కాంపిటీటివ్‌నెస్ అంశంపై మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించి తెలంగాణలో పౌర సేవలను మరింత సమర్థవంతంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు భరోసా వంటి సబ్సిడీల ట్రాకింగ్ నుంచి మొదలుకుని ఆస్తి పన్ను వసూళ్లు, మహిళలకు అందించే సంక్షేమ పథకాల అమలు, పట్టణ మున్సిపల్ సమస్యల పరిష్కారం వరకు అనేక రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
వ్యవస్థలోని మేధస్సే ఒకవైపు సమస్యగా ఉంటే మరోవైపు అదే పరిష్కారంగా మారుతోందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఏఐని సరైన దిశలో వినియోగిస్తే పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని అన్నారు. అధునాతన ఏఐ యుగంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉండలేవని, ముందస్తు చర్యలు తీసుకోవడం, వేగంగా నిర్ణయాలు అమలు చేయడమే కీలకమని ఏఐ ప్రభావం గురించి రేవంత్ అన్నారు.
‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను ముఖ్యమంత్రి వివరిస్తూ.. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు కేంద్రంగా మారిందని, అన్ని రంగాలకు చెందిన అగ్రశ్రేణి కంపెనీలు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉండాలంటే మేధోవంతమైన వ్యవస్థలను నిర్మించాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సదస్సులో స్మార్ట్ ఫ్యాక్టరీలు, స్థిరమైన ఇంధన వ్యవస్థలు, ఏఐ ఆధారిత సేవలు, స్మార్ట్ సిటీల నిర్మాణంపై ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ విధానాలపై చర్చించారు.