Crime News : శవాన్ని రెండు రోజులు ఇంట్లో ఉంచుకోవాలంటేనే చాలా ఆలోచిస్తూ ఉంటారు. అది కూడా అత్యవసర పరిస్థితుల్లోనే అంత్యక్రియలను ఆలస్యంగా చేస్తారు. చనిపోయినప్పటికీ కొందరు తమ పక్కనే ఉన్నట్టు ఫీలయి మరికొందరు భయపడుతూంటారు. కానీ తల్లి చనిపోయిందని తెలిసి కూడా.. ఆ శవాన్ని తమతోనే ఇంట్లోనే ఉంచుకున్నారు ఇద్దరు కూతుళ్లు. అది కూడా 9 రోజులు. వినడానికే భయాన్ని పుట్టించే ఈ ఘటన సికింద్రాబాద్‌ లో జరిగింది. ఈ హృదయ విదారకరమైన ఘటన ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..


సికింద్రాబాద్‌ వారాసిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బౌద్దనగర్ లో ఇద్దరు సోదరీమణులు తమ తల్లి మృతదేహంతో 9 రోజులు గడిపిన ఘటన సంచలనం సృష్టించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పని చేసే రాజుతో 26 ఏళ్ల క్రితం లలితకు వివాహం కాగా.. వీరికి రవళిక, యశ్విత ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2020లో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి రాజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో లలిత ఒక్కతే తన ఇద్దరు కుమార్తెలతో నివసిస్తోంది.పెద్ద కుమార్తె రవళిక వస్త్ర దుకాణంలోనూ, చిన్న కుమార్తె యశ్విత ఈవెంట్‌ ఆర్గనైజేషన్‌లో పని చేస్తూ తల్లికి ఆసరాగా ఉంటున్నారు. ఈ కుటుంబం 6 నెలల కిందటే వారాసిగూడలోని ఓ అద్దె ఇంటికి మారారు.


ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ఈ కుటుంబం గత 3 నెలలుగా అద్దె చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన లలిత జనవరి 22న నిద్రలోనే చనిపోయింది. ఉదయాన్నే తల్లిని నిద్ర లేపేందుకు ప్రయత్నించిన కుమార్తెలు షాక్ కు గురయ్యారు. తల్లి చనిపోయిందని నిర్ధారించుకుని, తల్లి మృతదేహం వద్ద అలానే ఏడుస్తూ ఉండిపోయారు. అండగా ఉండాల్సిన తండ్రి ఎలా అర్థాంతరంగా విడిచి వెళ్లడం, ఇప్పుడు ఒక్కసారిగా తల్లి కన్నుమూయడం వారిని మరింత బాధకు గురయ్యేలా చేసింది.


చేతిలో చిల్లిగవ్వ లేక.. ఆకలితో అలమటిస్తూ..


తల్లి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు చేతిలో ఒక్క పైసా కూడా లేకపోవడంతో ఇద్దరు కూతుళ్లకూ ఏం చేయాలో పాలు పాలేదు. అమ్మ లేని ఈ జీవితంలో తామూ ఉండలేమని భావించి, పదునైన వస్తువులతో గొంతు, మణికట్టు కోసుకునేందుకు ప్రయత్నంచారు. కానీ చనిపోయే ధైర్యం లేక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అమ్మ లేదన్న బాధ ఒకటైతే, డబ్బు లేక తీవ్ర ఆకలితో అలమటిస్తూ వారు ఎంతో మనోవేదనకు గురయ్యారు. ఈ సమయంలోనే రెండు సార్లు ఇంటికి వచ్చిన యజమానికి సైతం ఈ పరిస్థితి గురించి తెలియలేదు.


ఇక ఏదైతే అది అని భావించి, జనవరి 31న శుక్రవారం, సోదరీణులిద్దరూ బయటకు వచ్చి జరిగిన విషయాన్ని ఇరుగుపొరుగు వారికి సమాచారమిచ్చారు. వారు స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించడానికి సహాయం చేశారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి, వారాసిగూడ ఇన్స్ పెక్టర్ సైదులు, ఫోరెన్సిక్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని లలిత మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లి మృతదేహం ఓ గదిలో, అక్కాచెల్లెళ్లు మరో గదిలో ఉన్నారని, మానసిక ఆవేదనతో బాధపడుతోన్న ఇద్దరు కుమార్తెలను ఈ విషయంపై ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పారని పోలీసులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


Also Read : GBS News: తెలంగాణలో జీబీఎస్‌ కేసు- ప్రభుత్వం హైఅలర్ట్