Sigachi Blast Incident | హైదరాబాద్: ఆరు నెలల కిందట పెను విషాదాన్ని నింపిన సిగాచీ ఇండస్ట్రీస్ అగ్నిప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిగాచీలో అగ్నిప్రమాదం కేసులో ఆ సంస్థ సీఈవో అమిత్‌రాజ్‌ను పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జూన్ 30న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 8 మంది వరకు కార్మికులు, సిబ్బంది మృతదేహాలకు సంబంధించి ఒక్క ఎముక కూడా దొరకకపోవడం అత్యంత విషాదకరం.
తీవ్ర విషాదాన్ని నింపిన సిగాచీ కెమికల్స్ సంస్థసంగారెడ్డి పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ ఫార్మా యూనిట్‌లో జూన్ 30న షార్ట్ సర్క్యూట్ అయి, ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పరిశ్రమలో పని చేస్తున్న సిబ్బంది, కార్మికులు సహా 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మంటలు అంటుకుని, బయటకు వెళ్లే అవకాశం లేక మంటల్లో కాలి బూడిదయ్యారు.
కొన్ని రోజులపాటు అక్కడ సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్ చివరకు 46 మంది వరకు మృతదేహాలు, శరీర ఆనవాళ్లు వెలికితీశారు. కానీ 8 మంది కార్మికుల మృతదేహాలకు సంబంధించి చిన్న ఎముక కూడా వారికి ఇవ్వలేదని తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో యాజమాన్యం నిర్లక్ష్యం, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని నిర్ధారించారు. ఈ క్రమంలో ఘటన జరిగిన 6 నెలలకు సిగాచీ సంస్థ సీఈవో అమిత్‌రాజ్‌ను బాధ్యుడిగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.