Murder in Jagtial | జగిత్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఒక యువకుడి హత్య కలకలం రేపింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్న యువతితో ప్రేమ వ్యవహారం నడిపి, శారీరక సంబంధం పెట్టుకున్న యువకుడు యువతి అక్కతో సైతం లైంగిక సంబంధం కొనసాగించాడు. తన వద్ద యువతి అశ్లీల వీడియోలు ఉన్నాయని బయటపెట్టి, ఇటీవల యువతికి వచ్చిన పెళ్లి సంబంధాన్ని చెడగొట్టడంతో అక్కాచెల్లెళ్లు తమ ప్రియుడ్ని హత్యచేశారు.

Continues below advertisement

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో ఎఫైర్.. ఆపై ఆమె అక్కతోనూ రిలేషన్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పెద్దపల్లి జిల్లా తుర్కలమద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్ హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. నగరంలోనే  సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఒక యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి, వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె అక్కతో కూడా పరిచయం పెంచుకుని ఆమెతోనూ లైంగిక సంబంధాన్ని కొనసాగించాడు. అయితే, ఇటీవల ఆ యువతికి వచ్చిన పెళ్లి సంబంధాన్ని మహేందర్ తన వద్ద ఉన్న అశ్లీల వీడియోలను చూపి చెడగొట్టడమే కాకుండా, తనతో గడిపిన ప్రైవేట్ వీడియోలతో వారిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు.

Continues below advertisement

బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని హత్యకు ప్లాన్

మహేందర్ వేధింపులతో విసిగిపోయిన అక్కాచెల్లెళ్లు అతడిపై పగ పెంచుకున్నారు. ఎలాగైనా అతడిని వదిలించుకోవాలని పథకం వేశారు. ప్లాన్ ప్రకారం యువతి శుక్రవారం రాత్రి మహేందర్‌కు ఫోన్ చేసి, తన అక్క ఉండే ప్రాంతానికి రమ్మని పిలిచింది. రాత్రి సుమారు 10 గంటల సమయంలో అక్కడికి చేరుకున్న మహేందర్‌తో వారిద్దరూ వాగ్వాదానికి దిగారు. ముందస్తు పథకం ప్రకారం అతడి కళ్లలో కారం చల్లి, కర్రలతో దాడి చేశారు. అక్కాచెల్లెళ్లతో పాటు వారి అక్క కుమారుడు, మరో ఇద్దరు బంధువులు కూడా కర్రలతో విచక్షణారహితంగా మహేందర్‌పై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమైంది. 

నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఈ దాడిలో తలకు బలమైన గాయాలు కావడంతో మహేందర్ రక్తపు మడుగులో పడిపోయాడు. స్థానికులు గమనించి 108 వాహనంలో బాధితుడ్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, కానీ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. మృతుడికి భార్య, తల్లిదండ్రులు ఉన్నారని తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

కుటుంబాలను రోడ్డున పడేస్తున్న వివాహేతర సంబంధాలు

వివాహేతర సంబంధాలు ఒక్కరి జీవితానికి సంబంధించినవి కాదు. అవి క్రమంగా ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. హత్యలకు సైతం వెనుకాడటం లేదు. దాంతో వారి పిల్లలు అనాథలు అవుతున్నారు. మరోవైపు వివాహేతర సంబంధం పెట్టుకున్న వారి కుటుంబసభ్యులు సమాజంలో తలెత్తుకుని జీవించలేక వారు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కనుక ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులతోనే కాదు, తెలిసిన వారితో సైతం వివాహేతర సంబంధాలు సరికాదని పోలీసులు హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదు.