సంగారెడ్డి: సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో గందరగోళం నెలకొంది. ఘటన జరిగి రెండు రోజులు గడిచినా ఇంకా మృతదేహాల సంఖ్య, గాయపడిన వారి వివరాలు కొలిక్కిరాలేదు. 143 మందే డ్యూటికి వచ్చినట్టు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. సిగాచి కెమికల్స్ నుంచి వివరాలు సరిగ్గా లేకపోవడం ఇప్పటి వరకు సరిగా లెక్కలేని మృతులు, క్షతగాత్రుల సంఖ్య. అధికారులు చెబుతున్న లెక్కకు, మార్చురీ వద్ద మృత దేహాల లెక్కలకు మధ్య తేడా ఉంది. క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు అధికారులు వివరాలు చెప్పలేకపోతున్నారు. 

అధికారుల లెక్కల ప్రకారం 36 మంది మృతి చెందారు, 34 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కానీ ఇప్పటి వరకు 45 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తున్నా అధికారులు ధ్రువీకరించడం లేదు. మరోవైపు సిగాచి సంస్థ యాజమాన్య అటువైపు కన్నెత్తి చూడటం లేదు. యాజమాన్యం నుంచి ఏ ఒక్కరు వచ్చి పరిశీలించడకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.  

14 మంది పేర్లు అధికారికంగా ప్రకటించిన అధికారులు..

ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 14 మంది పేర్లు అధికారులు ప్రకటించారు. మనోజ్ రౌత్. జి నిఖిల్, శ్రీ రమ్య, వి ఆర్ జి నాగేశ్వరరావు, సునీల్ కుమార్, తేనా సుందర్, లంగజిత, రుస్తాన్ కథున్, జగన్మోహన్, జయ ప్రసన్న, హేమ సుందర్, శశి భూషణ్, గోవింద్ సాహూ, రామ్ సింగ్ లు మరణించినట్లు ప్రకటించారు.

సిగాచి యాజమాన్యంపై కేసు నమోదుపాశమైలారంలోని సిగాచి కెమికల్స్ కంపెనీలో సోమవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో 36 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ ఫిర్యాదుతో సిగాచి యాజమాన్యంపై 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పలువురు కాలిన గాయాలతో పటాన్ చెరు లోని ఆస్పత్రి, ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  

బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నాడు సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో అగ్నిప్రమాదం జరిగిన సిగాచి కెమికల్స్ ఇండస్ట్రీకి వెళ్లి పరిశీలించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అంతపెద్ద ప్రమాదం జరిగితే సిగాచి నుంచి యాజమాన్యంలో ఎవరూ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.1 కోటి, గాయపడిన వారికి రూ.5 లక్షలు ప్రకటించారు. అయితే తక్షణ సాయం కింద మృతుల కుటుంబాలకు రూ.1 లక్ష, గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు. తక్షణమే వారికి నగదు అందజేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ఆదేశించారు.