విమోచనం కోసం గొంతెత్తిన పార్టీ బీజేపీయేనని అన్నారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు స్వాతంత్య్రం  రావడానికి లక్షల మంది పోరాటం చేశారన్నారని... వేల మంది బలయ్యారని చెప్పారాయన. భారత సైన్యం కూడా నిజాం సైన్యంతో పోరాడిందని...  ఆ పోరాటంలో గెలుపు  సాధించి మువ్వన్నెల జెండా ఎగరేశారని చరిత్రను గుర్తుచేశారు. నిజాం సర్కార్‌ హయాంలో రైతులు, ప్రజలపై అకృత్యాలు జరిగాయని... నగ్నంగా బతుకమ్మ ఆడించారని  మండిపడ్డారు. అనేక రకాలుగా దోపిడీ చేశారని... అందుకే ప్రతీ గ్రామంలో ప్రజలు తెగించి పోరాడారని చెప్పారు. ఇన్నేళ్లు చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు  కిషన్‌రెడ్డి. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన వారు సెప్టెంబర్‌ 17కు ఉన్న ప్రాముఖ్యత, చరిత్రను తెలియకుండా చేశారన్నారని దుయ్యబట్టారు. అప్పట్లో ఈరోజున వల్లభాయ్‌  పటేల్‌ తిరంగా పతాకాన్ని ఆవిష్కరిస్తే... ఇప్పుడు అమిత్‌షా ఆ పని చేస్తున్నారన్నారు. విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు.


75 ఏళ్లుగా హైదరాబాద్‌ లిబరేషన్‌ను వేడుకలు జరపకుండా నిర్లక్ష్యం చేశారని ఫైరయ్యారు కిషన్‌రెడ్డి. త్యాగాలను దాచిపెట్టారని అన్నారు. నిజాంకు వ్యతిరేక పోరాట చరిత్రను కాంగ్రెస్‌ సమాధి చేసిందన్నారు కిషన్‌రెడ్డి. భూమి కోసం.. భుక్తి కోసం ఎందరో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. తెలంగాణ పోరాటయోధుల త్యాగాలను కాంగ్రెస్ గుర్తించలేదని విమర్శించారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపలేదని, కాంగ్రెస్‌ బాటలోనే ఇప్పుడు బీఆర్ఎస్ నడుస్తోందని ఆరోపించారు. విమోచన దినోత్సవాలు జరపకుండా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సెప్టెంబర్‌ 17... సమైక్య దినం ఎలా అవుతుందని ప్రశ్నించారు కిషన్‌రెడ్డి. 
పోరాటాలతో విముక్తి కల్పించుకుంటే... అది సమైక్యత దినం ఎలా అవుతుందని నిలదీశారు. 


సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన విమోచన దిన వేడుకల్లో కేంద్రమంత్రి అమిత్‌షా కూడా పాల్గొన్నారు. వార్ మెమోరియల్‌లో తెలంగాణ సాయుధ పోరాట వీరులకు నివాళులు అర్పించారు అమిత్‌షా. అలాగే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి నివాళులర్పించారు. పారామిలటరీ బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించారు.