సికింద్రాబాద్‌ పరిధిలోని రాంగోపాల్‌పేట డెక్కన్ స్టోర్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి రావడానికి మరికొన్ని గంటలు పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 20కిపైగా ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటికైతే వెనుక భాగంలో మంటలు దాదాపు అదుపులోకి వచ్చాయి. ముందు భాగంలో మాత్రం అగ్ని కీలలు ఎగసి పడుతున్నారు. 


ఎగసి పడుతున్న అగ్ని కీలలు చూసిన జనం భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దాదాపు కిలోమీటర్ పరిధిలోని షాపులన్నింటినీ క్లోజ్ చేశారు. ప్రమాదం జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల్లో జనాలను ఖాళీ చేయించారు. ఎలాంటి ప్రమాదం జరిగినా ఎదుర్కొవడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో వ్యాపించిన పొగ కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కి కూడా ఇబ్బందిగా మారింది. 


ఉదయం పది గంటల ప్రాంతంలో మొదలైన మంటలు కాసేపటి వరకు పెరుగుతూనే ఉన్నాయి. పక్కన ఉన్న రెసిడెన్సియల్ భవనాలకు కూడా మంటలు వ్యాపించాయి. ఇది మరింత ప్రమాదకరంగా మారుతుందన్న టైంలో అధికారులు తీవ్రంగా శ్రమించి ప్రమాద తీవ్రతను చాలా వరకు తగ్గించారు. 


భవనానికి మూడు వైపుల మంటలు వ్యాపించాయి. పొగ విపరీతంగా వస్తోంది. దీని వల్ల అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. అసలు రెస్క్యూ ఆపరేషన్ ఎంత వరకు వచ్చిందో అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ పొగ, మంటలు కారణంగా చుట్టుపక్కల ఉండే ప్రజల్లో చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. వాళ్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు.  


ముందు జాగ్రత్తగా స్థానికంగా ఉండే ప్రజలను ఖాళీ చేయించారు. విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపేశారు. నెట్‌ సేవలను బంద్ చేశారు. ఆ ప్రాంతమొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరూ రాకుండా చర్యలు తీసుకున్నారు. సంఘటనా స్థలంలోనే అంబులెన్స్‌ సర్వీసులు ఉంచారు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 


మంటల ధాటికి భవనం చాలా వరకు దెబ్బతిన్నట్టు అధికారులు భావిస్తున్నారు. గోడలకు పగుళ్లు ఉన్నట్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ భవనం ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని అంచా వేస్తున్నారు. అందుకే అటువైపు ఎవరూ వెళ్లకుండా గట్టి చర్యలు చేపట్టారు.