సికింద్రాబాద్‌లో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం తెలవారుతుండగానే ఓ బట్టల దుకాణంలో మంటలు రాజుకున్నాయి. క్రమంగా అవి షాప్‌ మొత్తానికి పాకిపోవడంతో మంటలు పెద్దగా మారాయి. వెంటనే ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. వెంటనే స్పందించిన అగ్ని మాపక సిబ్బంది మూడు ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ ఆయుర్వేదిక్‌ దుకాణం నుంచి మంటలు రేగినట్లుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


అగ్ని ప్రమాద ఘటన స్థలానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకున్నారు. ప్రమాద ఘటనపై అధికారులను ఏ విధంగా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాలిక బజార్ లోని బట్టల దుకాణంలో ఇవాళ ఉదయం తెల్లవారు జామున అగ్నిప్రమాదం జరిగిందని అన్నారు. ప్రస్తుతానికి మంటలను అగ్నిమాపక శాఖ, DRF సిబ్బంది కొంత అదుపులోకి తీసుకొచ్చారని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోందని, లోపల చిక్కుకున్న ఇద్దర్నీ బయటకు తీసుకువచ్చారని అన్నారు. ఏటువంటి ప్రాణ నష్టం లేదని చెప్పారు. చిన్న చిన్న దుకాణాల్లో గోదాములు నిర్వహిస్తున్నాదని, అందువల్లనే ప్రమాద తీవ్రత పెరుగుతుందని అన్నారు. ఈ అగ్నిప్రమాదంపై కమిటీ వేసి కారణాలు తెలుసుకుని ప్రమాద కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని చెప్పారు.