Secunderabad Fire Accident: సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం అని ప్రాథమికంగా భావిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఎప్పుడూ రద్దీగా ఉండే స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో 5, 7 అంతస్తుల్లో ఉన్న దుకాణాలు పూర్తిగా కాలిపోయాయాని తెలిపారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు తమకు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ డీజీ వెల్లడించారు. సమాచారం అందిన తర్వాత హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని భవనం లోపల చిక్కుకుపోయిన 12 మందిని కాపాడామని, కానీ దురదృష్టవశాత్తు అందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు నాగిరెడ్డి తెలిపారు.


అజాగ్రత్తే కొంప ముంచింది!


స్వప్నలోక్ భవన యజమానులకు ఫైర్ సేఫ్టీ గురించి చెప్పినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని నాగిరెడ్డి తెలిపారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో ఫైర్ సేఫ్టీ ఉన్నప్పటికీ, అవి ఏమాత్రం పని చేయడం లేదని అగ్నిమాపక శాఖ డీజీ వెల్లడించారు. అగ్నిప్రమాద ఘటనలో షాపు కీపర్ల నిర్లక్ష్యం స్పష్టంగాక నిపిస్తోందన్నారు. ప్రస్తుతం భవన పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్ లో తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ పెట్టుకుంటే సరిపోదని వాటి నిర్వహణ సరిగ్గా చూసుకోవాలని తెలిపారు. ప్రధానంగా కమర్షియల్ కాంప్లెక్స్ లు లాక్ చేయకూడదన్నారు. తాళాలు వేసి ఉండటంతో కొంత మంది బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వ్యాపార లావాదేవీలు నిర్వహించే వారు నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఈ విషయంపై గతంలో స్వప్నలోక్ కాంప్లెక్స్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రతి కాంప్లెక్స్ లో మెట్ల దారి కూడా తెరిచే ఉంచాలని, ఏ కాంప్లెక్స్ లోనైనా.. మెట్ల దారి లాక్ చేస్తే 101 కు ఫోన్ చేయాలని నాగిరెడ్డి తెలిపారు.


అసలేం జరిగిందంటే..?


సికింద్రాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ 7, 8 అంతస్థులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చాలా మంది చిక్కుకున్నారు. వారిలో ఆరుగురు ఊపిరి ఆడక మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి కొందర్ని రక్షించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో బట్టల షాపులు, గోడౌన్లు ఉన్నాయి. సెల్ ఫోన్ టార్చ్‌లు చూపిస్తూ రక్షించాలని పలువురు వేడుకున్నారు. 


ఎగిసిపడిన మంటలు


సికింద్రాబాద్ ప్యాట్నీ వద్ద గల స్వప్న లోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని 7,8 అంతస్థులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగ వ్యాపించడంతో పలువురు ఆఫీసుల్లోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.  ఈ కాంప్లెక్స్ లో పలు కార్యాలయాలతో పాటు వాణిజ్య సముదాయాలు ఉండడంతో పదుల సంఖ్యలో ఉద్యోగులు చిక్కుకున్నారు. సహాయం కోసం ఫోన్ టార్చ్ చూపిస్తూ ఆర్తనాదాలు చేశారు. మంటల్లో చిక్కుకున్న వారు పొగతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు.