మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్‌ నేతల మధ్య ముసలం పుట్టిందన్న పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ జిల్లా మంత్రితో  ఎమ్మెల్యేలకు పొసగడం లేదన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అంతా బీఆర్‌ఎస్‌ లీడర్లే అయినప్పటికీ మంత్రి వ్యవహార శైలితో విసిగిపోతున్నామని ఎమ్మెల్యేలు వాపోతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.


మేడ్చల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల రహస్య మంతనాలు ఆ పార్టీలో కలకలం రేపాయి. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు భేటి అయ్యారు. మైనంపల్లితో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్‌ గౌడ్‌, శేరిలింగంపల్లి అరికపూడి గాంధీ సమావేశమయ్యారు. ఇందులో ఏం చర్చించారన్న విషయంపై మాత్రం ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు. 
 
మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగానే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. దీనికి ఓ పెళ్లి వేడుకలో జరిగిన సంఘటనలే ఈ భేటీకి కారణంగా కనిపిస్తున్నాయి. ఆ వేడుకలో మైనంపల్లి, మంత్రి మల్లారెడ్డి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి మల్లారెడ్డి... ఇతర ఎమ్మెల్యేల పనులు చేయొద్దని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.


మంత్రి మల్లారెడ్డి వ్యవహార శైలిపై ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే మైనంపల్లి ఇతర ఎమ్మెల్యేలు సమావేశమై చర్చించారని బోగట్టా. ఈరోజు ఉదయం నుంచి మంత్రి జిల్లాలోని ఎమ్మెల్యేలంతా మైనంపల్లి ఇంట్లో రహస్య సమావేశాలు జరిపారట. మల్లారెడ్డి తీరు ఇబ్బందికరంగా ఉందని చర్చినట్టు తెలుస్తోంది. దీనిపై పార్టీ అధినాయకత్వానికి కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించారని వారి అనుచరులు చెబుతున్నారు. 


బయట టాక్ ఇలా ఉంటే అసలు ఈ భేటీకి అంత ప్రాధాన్యత లేదంటున్నారు మైనంపల్లి. ఇటీవల తన మనవడి 21 రోజుల పండుగ జరిగిందని... దానికి రాని ఎమ్మెల్యేలు ఇవాళ వచ్చారని చెబుతున్నారు. అందరూ వచ్చి బ్రేక్‌ఫాస్ట్‌ చేసి వెళ్లారని వివరణ ఇచ్చారు. భేటికి ఎలాంటి రాజకీయ ప్రాధన్యత లేదంటున్నారు మైనంపల్లి.