Alleti Maheshwar Reddy | హైదరాబాద్: ఎటువంటి కండిషన్ లేకుండా రైతులకు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇన్ని కండిషన్స్ ఎందుకు పెట్టారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఆశ్చర్యకంగా రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టీ చాలా మంది లబ్ధిదారులకు మాఫీ ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒకే రేషన్ కార్డు లో ఉన్న అన్నదమ్ములు భూములు పంచుకొని వేర్వేరుగానే బ్యాంకు లోన్, రైతు రుణాలు తీసుకుంటారని.. వారి పరిస్థితి ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. రుణ మాఫీ మార్గదర్శకాలు గమనిస్తే రుణాలు మాఫీ చేయడం కాదు, హామీల అమలులో లబ్ధిదారులను మాఫీ చేస్తున్నట్లు ఉందన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణాల మాఫీకి విడుదల చేసిన మార్గదర్శకాలపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా, ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. రుణమాఫీకి మాత్రం రేషన్ కార్డును ఎలా లింక్ చేస్తారని ప్రశ్నించారు. ఇంట్లో ఒకే రేషన్ కార్డు మీద చాలా మంది ఉంటే.. అందులో కేవలం ఒక్కరికే రుణమాఫీ ఇవ్వడంతో మిగతా వాళ్లు నష్టపోతారని తెలిపారు. ఒక్కరికి చిన్న ఉద్యోగం ఉన్నా, ఆ కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు తీసేస్తున్నారని చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే ఏ కండిషన్ లేకుండా రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
రేషన్ కార్డు ప్రాతిపదికన రైతు కుటుంబానికి రూ.2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకూ లోన్ తీసుకున్న రైతులు లబ్దిదారులు కానున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మార్గదర్శకాలపై అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.
రేవంత్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డి మరో బహిరంగ లేఖ
పంచాయతీల్లో నిధులు లేక పనులు చేయలేమని ప్రజావాణిలో గ్రామ కార్యదర్శులు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గ్రామాల్లో పాలన దారుణంగా తయారైందని విమర్శించారు. తమది ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ముందు పల్లెలకు పోతే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని ఎద్దేవా చేశారు.
అప్పు, సప్పు చేసి పల్లెల్లో అభివృద్ధి పనుల కోసం సర్పంచులు చేసిన ఖర్చులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించడం లేదని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. కమీషన్లు ఇచ్చే మంత్రులకు చెందిన కంపెనీలకు, కాంట్రాక్టర్లకు వేల కోట్ల నిధులు విడుదల అవుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.
ఎన్నికల సందర్భంగా వార్డ్ మెంబర్ తో సహా అందరికీ, స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలో దోచుకోవడం, దాచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోందని బీజేపీ నేత మండిపడ్డారు.
Also Read: హైదరాబాద్‌లో ఏ క్షణంలోనైనా భారీ వర్షం - పలు జిల్లాల్లో వర్షాల కారణంగా IMD ఆరెంజ్ అలర్ట్