నారాయణ్‌ఖేడ్: ఇటీవల ఇందిరమ్మ ఇంటి మంజూరు కోసం ఓ మహిళను అధికారి లంచం అడిగితే ఆమె ఎలా బుద్ధి చెప్పిందో తెలుగు రాష్ట్రాలు మొత్తం చూశాయి. లంచం డబ్బులు తీసుకెళ్లి అందరూ చూస్తుండగా నువ్వు అడిగిన డబ్బులు తెచ్చాను తీసుకో అంటూ వెంటపడి మరీ అతడికి బుద్ధొచ్చేలా చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఆర్టీసీ బస్సులో లంచం అడిగిన ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. లంచం అడిగిన టికెట్ ఇన్‌స్పెక్టర్ ను కండక్టర్, ప్రయాణికులు చెప్పుతో కొట్టారు. 

Continues below advertisement

అసలేం జరిగింది.. హైదరాబాద్ నుండి నారాయణ్‌ఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును తనిఖీ చేసేందుకు తెలంగాణలోని రాయికోడ్ వద్ద టికెట్ స్క్వాడ్ అధికారులు నిలిపివేశారు. ఆ బస్సులో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. చెకింగ్ సమయంలో ఒక ప్రయాణికుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు టికెట్ ఇన్‌స్పెక్టర్లు గుర్తించారు. అయితే, నిబంధనల ప్రకారం అతనికి విధించాల్సింది రూ. 500. కాగా, జరిమానా విధించకపోగా.. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు టికెట్ ఇన్‌స్పెక్టర్ ఆ ప్యాసింజర్, కండక్టర్‌ను ఏకంగా రూ. 20,000 లంచం డిమాండ్ చేశాడు. 

టికెట్ ఇన్‌స్పెక్టర్ చేసిన ఈ డిమాండ్‌తో కండక్టర్, ప్రయాణికుడితో పాటు బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సహనం కోల్పోయిన వారు ఆ ఆర్టీసీ టికెట్ ఇన్‌స్పెక్టర్‌ను చెప్పులతో కొట్టారు. ఈ క్రమంలో బస్సు కండక్టర్ కూడా ప్రయాణికులతో కలిసి మరిన్ని చెప్పు దెబ్బలు కొట్టి బుద్ధి చెప్పాడని తెలుస్తోంది. సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల సిబ్బందిపై పనిభారం ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో రద్దీ కారణంగానే టికెట్ ఇవ్వడం కండక్టర్‌కు సాధ్యపడలేదని తెలుస్తోంది. 

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక వ్యక్తిని ఇలా గుంపుగా కొట్టడాన్ని చట్టప్రకారం సమర్థించలేకపోయినా, సామాన్య ప్రజల ఆగ్రహాన్ని మాత్రం నూటికి నూరు శాతం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నిత్యం కష్టపడి పనిచేసేవారు ఎవరైనా లంచం అడిగితే మండిపడుతున్నారు. వారికి బుద్ధి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తమను పీల్చిపిప్పి చేసే లంచగొండి వ్యవస్థ తీరుపై తీవ్ర అసహనంతో దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.