మునుగోడు ఉపఎన్నికలో టిఆర్ఎస్ నైతికంగా ఓడిపోయిందని విమర్శించారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ మునుగోడులో టిఆర్ఎస్ 500 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకత్వం మొత్తాన్ని, పార్టీ శక్తిని మొత్తం దారపోస్తే కూడా కేవలం పదివేల మెజార్టీ వచ్చిందని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ పార్టీ ఒంటరిగా గెలవలేకనే కమ్యూనిస్టులను కలుపుకున్నారన్నారు. 


ఎన్నికల సమయంలో ప్రజలకు డబ్బు, మద్యం పంపిణీలో టిఆర్ఎస్, బిజెపి పోటీపడ్డాయని విమర్శించారు ప్రవీణ్‌ కుమార్. వీటిని అడ్డుకోవడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలను ఒక సంఖ్యగానో లబ్దిదారులుగానో మాత్రమే టిఆర్ఎస్, బిజెపి నేతలు చూస్తున్నారు తప్ప.. అభివృద్ధికి కృషి చేయడం లేదన్నారు. ఈ రెండు పార్టీలు దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకొని అప్పులకుప్పగా మార్చాయని గుర్తుచేశారు.






రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ, గవర్నర్ కలిసి తెలంగాణ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని పేర్కొన్నారు ప్రవీణ్ కుమార్. విద్యార్థులకు న్యాయం చేయడంలో ఇరువురికి చిత్తశుద్ది లేదన్నారు. బిజెపి దేశంలో అనాగరిక, దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు.


మునుగోడు ఎన్నికల్లో ఒక మంచి అనుభవం, గొప్ప ఆదరణ లభించిందన్నారు. మునుగోడు అనుభవంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసి, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ పాలనలో ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించి, అన్ని రంగాల్లో జనాభా ప్రాతిపదికన వాటా కల్పించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. తెలంగాణను దోచుకుంటున్న పార్టీలను ఓడించి, ప్రజలకు దోపిడి పాలన నుంచి విముక్తి కల్పించి అమరుల ఆశయాలను నెరవేరెస్తామని తెలిపారు.






రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయవాది వడ్లకొండ.రవికుమార్ రెడ్డి పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.