Global Analytics Technology: హైదరాబాద్ గ్లోబల్ అనలటిక్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు రోచే ఫార్మా సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో డేటా అనలిటిక్స్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. నగరంలో డేటా సైన్స్, అడ్వాన్స్ డ్ అనలిటిక్స్ సంబంధిత సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి పెట్టుబడి పెట్టనుంది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తో కలిసి రోచే ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఇమ్మాన్యుయేల్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రోచే ఫార్మా తమ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను స్థాపించడానికి హైదరాబాద్ ను ఎంచుకోవడం గర్వ కారణంగా ఉందని అన్నారు. 






టాలెంట్‌కు హైదరాబాద్‌లో కొదవలేదు ! 
హైదరాబాద్ దేశంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థలను, అత్యంత నైపుణ్యం కల్గిన ప్రతిభావంతులైన నిపుణులు, అత్యాధునిక మౌలిక సదుపాయాలను కలిగి ఉందని చెప్పారు. ప్రభుత్వం గ్లోబల్ ఇన్నోవేషన్, కెపబిలిటీ సెంటర్లకు ప్రాధాన్యతను ఇస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ వైబ్రెంట్ లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టమ్ ను రోచె ఛైర్మన్ కు అందించారు. 2020 వ సంవత్సరంలో, ఈ ఏడాది మే నెలలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో కేటీఆర్ కృషికి గాను ఇప్పుడు రోచె సంస్థ తమ అనలటిక్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్ లెన్స్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ట్విట్టర్ పేర్కొంది. 


ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ హాజరయ్యారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వ పాలన ఉండటం వల్లే దేశ విదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీల పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. వ్యాపార- స్నేహ పూర్వక వాతావరణం,  టీఎస్ ఐపాస్ వంటి ఆదర్శనీయ విధానాలకు ఆకర్షితులై పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని పేర్కొంది. గత వారం రోజుల్లో మూడు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం హర్షణీయమని తెలిపింది. అక్టోబర్ 9వ తేదీ నుండి 16 వ తేదీ వరకు రాష్ట్రానికి రూ.1,850 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వారం రోజుల్లో మూడు కంపెనీలో రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించాయి. ఈ మూడు సంస్థల రాకతో కొత్తగా 4 వేల 500 మందికి ఉపాధి లభించనున్నట్లు పరిశ్రమల శాఖ పేర్కొంది. 


అక్టోబర్ 10వ తేదీన ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ (IIL) రూ. 700 కోట్లతో జంతు టీకా తయారీ యూనిట్ ను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ యూనిట్ ద్వారా కొత్తగా 750 ఉద్యోగాలు రానున్నాయి. అక్టోబర్ 12వ తేదీన జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ.. తమ ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీని రూ. 400 కోట్లతో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ రిఫైనరీ యూనిట్ ద్వారా దాదాపు వెయ్యి మందికి ఉపాధి లభించనుంది. అక్టోబర్ 15వ తేదీన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్త తమ తయారీ, గోల్డ్ రిఫైనరీ ఫెసిలిటీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తామని పేర్కొంది. రూ. 750 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ తయారీ కేంద్రం ద్వారా దాదాపు 2750 ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ పేర్కొంది.