Telangana Assembly Sessions | హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదిక అధికార ప్రతిపక్ష నేతల మధ్య సెగలు పుట్టిస్తోంది. కమిషన్ నివేదికపై హరీష్ రావు వివరణ ఇస్తున్న కొద్దిసేపటికి మైక్ అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్దాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టినందుకు మిమ్మల్ని ఉరితీయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అవసరం లేకున్నా కేంద్రానికి బీఆర్ఎస్ లేఖలు

తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డ వద్దకు ప్రాజెక్ట్ ప్లాన్ మార్చడం సరైన నిర్ణయం అంటూ హరీష్ రావు సమర్దించుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి 2009, 2014 లో రెండు సార్లు కేంద్రం నుండి అనుమతులు ఉన్న తరువాత తిరిగి మళ్లీ ఎగ్జామిన్ చేయాలని లేఖ రాయాల్సిన అవసరం లేనప్పటికీ కావాలనే కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని ఆరోపించారు. ముందుగానే మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేందుకు పక్కా ప్లాన్ చేసుకున్న కేసీఆర్ , అందుకు అనుగణంగా లేఖలు రాసి, అనుమతులు తెచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారని రిపోర్టులో స్పష్టంగా ఉందని తెలిపారు. గత ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఇంజనీర్ల కమిటీ సైతం మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడ ప్రాజెక్టును కట్టడం వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతుందని హెచ్చరించినా గత ప్రభుత్వం లెక్కచేయలేదు.  

ఇంజనీర్ల రిపోర్టు తొక్కిపెట్టినట్లు కమిషన్ తేల్చింది..మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును కట్టేందుకు కావాలనే హరీష్ రావు కుట్రపూరితంగా వ్యవహరించారనే విషయం నివేదిక లో స్పష్టంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కడితే సమయం, డబ్బు వృధా అవుతుందని ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన రిపోర్టను దాచినపెట్టిన విషయం కమిషన్ ముందు చెప్పకుండా కాళేశ్వరం కమిషన్ ను తప్పుదోవపట్టించారని, బాధ్యులను శిక్షించాలంటూ కమిషన్ నివేదికలో స్పష్టంగా ఉందన్నారు.కావాలనే తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. తుమ్మడిహట్టి నుండి మేడిగడ్డకు బ్యారేజి తరలించి,  మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టి, లిఫ్ట్ లు, పంపులు పెట్టి లక్షకోట్లు కొల్లగొట్టాలని ప్లాన్ చేశారు. అందుకు అడ్డుగా ఉన్న ఇంజనీర్ల నివేదికను కావాలనే మాయం చేశారని రేవంత్ ఆరోపించారు. 

వీళ్లను ఉరితీయాలి...తుమ్మిడిహట్టి వద్ద ఏదైతే హెచ్చరిక రాశారో అదే హెచ్చరిక మేడిగడ్డ వద్ద కూడా రాశారు. ఇలా సిగరెట్ ప్యాకెట్ లపై పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అన్నట్లు హెచ్చరిక మాదిరిగా ,ఇలా ప్రాజెక్టు వద్ద చెప్పడం సర్వసాధారణం. ముందు జాగ్రత్త తీసుకోవడం కోసమే ఇలా రాస్తారు. నీటి లభ్యత అనుకూలంగా ఉందని మీరు చెబుతున్న మేడిగడ్డ వద్ద కూడా అదే హెచ్చరిక రాసింది సీడబ్ల్యూసీ. మీరు కట్టే ప్రాజెక్టును మరోసారి సరిచూసుకుని ముందుకు వెళ్లమని వార్నింగ్ క్లాస్ ఇవ్వడం సర్వసాధారణం. కాళేశ్వరం కమిషన్ ను సైతం తప్పుదోవ పట్టేంచాలా , ఇంజనీర్ల రిపోర్టు తొక్కిపెట్టి,  మేడిగడ్డ వద్ద మాత్రమే ప్రాజెక్టు కట్టేందుకు అనుకూలంగా ఉందని నమ్మించినందుకు వీళ్లను ఉరితీయాలంటూ కేసీఆర్ ప్రభుత్వంపై అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. 

మీరు చేయాల్సిన తప్పులకు ముసుగు తొడుక్కున్నారనే విషయం కమిషన్ తేల్చింది కాబట్టే మీకు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మీకు కక్ష, ద్వేషం అన్నారు. ఇప్పటికైనా సభను తప్పుదోవ పట్టించకండి, మీరిచ్చే తప్పుడు సమాచారం చదివి భవిష్యత్ లో అసెంబ్లీకి వచ్చే సభ్యులు ఇదే నిజమనే బ్రాంతికి లోనవుతారంటూ హరీష్ రావుకు కౌంటరిచ్చారు రేవంత్ రెడ్డి