CM Revanth Reddy: సిగాచి యాజమాన్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం, నిపుణులతో అధ్యయనం చేయాలని ఆదేశాలు

Shankar Dukanam   |  01 Jul 2025 11:58 AM (IST)

పాశమైలారంలో పేలుడు సంభవించిన సిగాచి పరిశ్రమకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. అక్కడే అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించిన రేవంత్ కారణాలపై అధికారులను ఆరా తీశారు.

పాశమైలారంలో ఘటనా స్థలంలో సీఎం రేవంత్ రెడ్డి

పాశమైలారం: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ప్రమాదం జరిగిన స్థలాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) మంగళవారం ఉదయం పరిశీలించారు. సోమవారం ఉదయం సిగాచి కెమికల్స్ లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 36కు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి అధికారులను ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు.

ప్రమాదం జరిగిన సిగాచి పరిశ్రమలో గతంలో తనిఖీలు చేశారా, బాయిలర్లను తనిఖీ చేసి ప్రమాదానికి ఏమైనా కారణాలు గుర్తించారా అని ఆరా తీశారు. ఊహించి సమాధానాలు చెప్పకూడదని, ప్రమాదాలకు వాస్తవ కారణాలు గుర్తిస్తే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. పేలుడు స‌మ‌యంలో ఫ్యాక్ట‌రీలో 143మంది ఉండ‌గా... కేవ‌లం 58మందిని గుర్తించినట్లు తెలిపారు.

సిగాచి ఇండస్ట్రీలో జరిగిన పేలుడు ఘటనకు బాధ్యులు ఎవరో మొదట గుర్తించండి. వారినే మనం బాధ్యులు చేస్తేనే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే రేపు నాకు సంబంధం లేదని ఆ వ్యక్తులు అంటారు. కంపెనీలో తనిఖీలు చేశారా. పేలిన బాయిలర్ తనిఖీ చేసి ఏమైనా సమస్యలు, లోపాలు గుర్తించారా? వాటికి సంబంధించి వివరాలు ఏమున్నాయి. గతంలో తనిఖీలు చేసి సమస్య ఉంటే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారా?. తనిఖీలు చేయడంతోనే సరిపోదు. లోపాలను సరిద్దడానికి కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకుంది. మృతదేహాలను గుర్తించడం ఓ సవాల్. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడటం మరో సవాల్. కంపెనీకి సంబంధించి బాధ్యుతల వివరాలు సేకరించండి. ఆ వ్యక్తి లేకపోతే ఎవరు బాధ్యతలు తీసుకుంటారు, ప్రభుత్వం ఎవరితో చర్చించాలన్న పూర్తి వివరాలు సేకరించండి- సీఎం రేవంత్ రెడ్డి

సిగాచి యాజమాన్యంపై చర్యలు

ఇంత పెద్ద ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా సిగాచి కెమికల్స్ ఇండస్ట్రీకి సంబంధించిన యాజమాన్యం ఒక్కరూ కూడా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రమాదంపై నిపుణులతో అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 

సీఎం వెంట మంత్రులు.. 

అంతకుముందు పాశమైలారం ఘటనాస్థలి వద్ద అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. సిగాచి కెమికల్స్ ఇండస్ట్రీలో ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యలు చేపట్టిన తీరుతో పాటు మృతుల వివరాలపై అధికారులతో సమీక్షించారు. ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో మానవతా కోణంలో చూడాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు వివేక్‌ వెంకట్ స్వామి, శ్రీధర్‌ బాబు, పొంగులేటి, దామోదర రాజనర్సింహ ఉన్నారు. 

పాశమైలారం ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి పటాన్ చెరులోని ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. పాశమైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 42కి చేరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారులు ఇంకా మృతుల సంఖ్య 36కు చేరినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై తమ ప్రభుత్వం ఫోకస్ చేసిందన్నారు.

 

Published at: 01 Jul 2025 11:58 AM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.