హైదరాబాద్: దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ కలలు సాకారం కావాలంటే రాహుల్ గాంధీ భారత ప్రధాని కావాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే వరకు తాము విశ్రమించేది లేదన్నారు. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన రాజీవ్ గాంధీ సేవలను, దార్శనికతను స్మరించుకుంటూ ప్రసంగించారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “రాజీవ్ గాంధీ దేశ సమగ్రతకు తన ప్రాణాలు అర్పించిన మహానేత. దేశ యువతకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. ఆయన చూపిన మార్గంలోనే తెలంగాణను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళతాం. పారదర్శక పరిపాలన కోసం సాంకేతికతను పాలనలోకి తీసుకురావాలనే ఆలోచన రాజీవ్ గాంధీదే. 18 ఏండ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించి, ప్రజాస్వామ్యంలో వారికి స్థానం కల్పించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన దార్శనికుడు. 

కంప్యూటర్‌ సాంకేతికతను దేశానికి పరిచయం చేసి డిజిటల్ విప్లవానికి బీజం వేశారు. టెలికాం రంగంలో అమూల్యమైన మార్పులు తీసుకురావడంలో రాజీవ్ గాంధీ పాత్ర అపూర్వం. హైటెక్ సిటీ రూపకల్పనకు రాజీవ్ గాంధీ ఆలోచనలు బేస్ అయ్యాయి. ఇంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ స్ఫూర్తితో సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపామని’ గుర్తు చేశారు.

రాహుల్ గాంధీపై విశ్వాసంరేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాహుల్ గాంధీని భారత ప్రధాని చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తామన్నారు. “21 ఏళ్లు నిండిన వారు శాసనసభకు పోటీ చేయగలిగేలా చట్టాన్ని సవరించేందుకు ప్రయత్నిస్తాం,” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.