హైదరాబాద్: వినికిడి లోపం కారణంగా బాధ పడుతున్న చిన్నారి నేతావత్ లిఖితా శ్రీకి ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాలుగేళ్ల చిన్నారి వినికిడి లోపంతో బాధపడుతుందని తెలిసి సీఎం రేవంత్ చలించిపోయారు. బాలికకు తక్షణం ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించాలని ఆదేశించారు.
నలుగురు పిల్లలతో కలిసి ఆడుతూపాడుతూ సరదాగా గడపాల్సిన ఆ పాపకు వినికిడి లోపం శాపంగా మారిందన్నారు. ఎవరు ఏం చెబుతున్నారో కూడా అర్థం కాక లిఖితా శ్రీ అమాయకంగా అలాగే ఉండిపోతోందని తెలిసి సీఎం రేవంత్ రెడ్డి చలించిపోయారు. ఆ పాపలో వినికిడి లోపాన్ని గుర్తించిన తర్వాత తల్లిదండ్రులు చికిత్స కోసం ఎందరో డాక్టర్లను సంప్రదించారు.
కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ తప్పని సరి అని చెప్పడంతో అందుకు అవసరమయ్యే ఖర్చును భరించే స్తోమత తమకు లేదని తల్లిదండ్రులు ఆవేదనకు లోనయ్యారు. ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి రాగానే వెంటనే ఆయన మానవత్వంతో స్పందించారు. వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారి లిఖితాశ్రీకి అవసరమైన పూర్తి వైద్యం ఉచితంగా అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైన చికిత్స జరిగి లిఖిత పూర్తిగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తమ సమస్యపై స్పందించి, పాపకు ఉచితంగా చికిత్స అందించాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి పాప కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు.