కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసం పునాదులు వేయడానికి తాము పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశామని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికి ఏఐసీసీ ఆదేశాల మేరకు తనతో పాటు పార్టీ ఇతర సీనియర్ నాయకులందరూ కలిసి పొంగులేటి శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించామని తెలిపారు. కేసీఆర్ ను ఎలా గద్దె దించాలనే విషయంలో అందరం కలిసి చర్చించుకున్నామని తెలిపారు. హైదరాబాద్ లోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా ఇతర సీనియర్ నేతలు కలిసి దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిపారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.


రేణుకా చౌదరి, భట్టి విక్రమార్క సహా పార్టీ నేతలందరి సూచనల మేరకు పొంగులేటి శ్రీనివాస్ సహా ఆయన అనుచరగణాన్ని పార్టీలోకి ఆహ్వానించామని చెప్పారు. త్వరలోనే ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీని త్వరలోనే కలిసి అన్ని రాజకీయ పరిణామాలు వివరిస్తామని, అనంతరం ఖమ్మం సభ ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ చేరిక అనేది తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు అందించడానికి ఉపయోగపడుతుందని తాము విశ్వసిస్తున్నామని తెలిపారు. క్రిష్ణా పరివాహక ప్రాంతం మొత్తం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి సిద్ధంగా ఉందని వివరించారు.



తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ కుటుంబమే బాగుపడిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. యూఏపీఏ (ఉపా) చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ విమలక్క సహా ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులపై పెట్టిన దేశ ద్రోహ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ పేరుతో దోపిడీ చేస్తున్నారని, కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బంగారుమయం అయిందని విమర్శించారు. రాష్ట్రంలో వరికి సరైన గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.


కోమటి రెడ్డి విమర్శలు


ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పాలన పట్ల విమర్శలు చేశారు. అప్పులు తీసుకొచ్చి రోడ్లు కూడా వేయలేదని అన్నారు. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఎంపీ కోమటిరెడ్డి విమర్శించారు. ధరణి పేరుతో రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. తమకు అధికారం కాదని, ప్రజల బాగోగులే ముఖ్యం అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.


తొలుత రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఇద్దరూ ఇతర నేతలతో కలిసి బయలుదేరి ముందు జూపల్లి క్రిష్ణారావు నివాసానికి వెళ్లారు. జూపల్లి నివాసంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేష్ రెడ్డితో భేటీ అయ్యారు. జూపల్లి ఇంటి నుంచి తిరిగి నేతలంతా కలిసి పొంగులేటి ఇంటికి వెళ్లారు.


మరోవైపు నల్గొండ జిల్లాకు చెందిన శశిధర్ రెడ్డి , వేముల వీరేశంలను కూడా పార్టీలో చేర్చుకోవాలనుకున్నారు. కానీ వీరి చేరికలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తన జిల్లాకు సంబంధించిన చేరికలపై తనతో సంప్రదించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలియడంతో ముందుగా రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి ఇంటికే వెళ్లారు.