దుద్యాల: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌లో కొనసాగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనుల జాప్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను గత 25 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానని, కాంట్రాక్టర్లు, అధికారుల పనితీరు తనకు బాగా తెలుసని సీఎం పేర్కొన్నారు. ఏడాది క్రితం పనులు మొదలుపెట్టినప్పటికీ.. ఇప్పటికీ పిల్లర్ల స్థాయిలోనే ఎందుకు నిలిచిపోయాయని ప్రశ్నించారు. ఇలాగైతే వచ్చే ఏడాది నుంచి ఇక్కడ తరగతులు ఎలా ప్రారంభిస్తారని అధికారులను నిలదీశారు. కాగితాలపై లెక్కలు చూపిస్తే నమ్మే వ్యక్తిని కానని స్పష్టం చేశారు.

Continues below advertisement

అలా పనిచేస్తే విధుల్లోంచి తొలగిస్తాం.. అధికారులకు వార్నింగ్గుట్టలు, కొండలతో కూడిన స్థలం కావడం వల్ల భూ కేటాయింపులు, ప్రారంభ పనుల్లో కొంత ఆలస్యం జరిగిందని ఈ సందర్భంగా TG EWIDC MD గణపతిరెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీధర్  వివరించారు. గడిచిన 15 రోజులుగానే పనుల్లో వేగం పెరిగిందని సీఎంకు తెలియజేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. సుమారు రూ. 200 కోట్ల భారీ వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు తగినంత మంది నిపుణులైన కార్మికులు లేకుండా వేగంగా పూర్తి చేయడం సాధ్యపడదని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను తక్షణమే విధుల్లోంచి తొలగించాలని, పనుల్లో ఏమాత్రం ఆలస్యం జరిగినా సహించేది లేదని వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారీని ఆదేశించారు.

పనుల వేగాన్ని పెంచేందుకు ప్రస్తుతం ఉన్న కార్మికుల సంఖ్యను 400కు పెంచామని, ఉదయం, సాయంత్రం రెండు షిఫ్టుల్లో పనులు నిర్వహించేలా ప్లాన్ రూపొందించామని అధికారులు వివరించారు. రాత్రి వేళ పనులకు తగినంత లైట్ల ఏర్పాటు లేకపోవడాన్ని సీఎం గుర్తించి, ఉదయం 5 గంటల నుంచే పనులు ప్రారంభించేలా 12 నుండి 13 గంటల వ్యవధిలో రెండు విడతల్లో కార్మికులతో పనులు చేయించాలని సూచించారు. ఇకపై ఈ పనుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు నెలకు ఒకటి రెండు రోజులు హకీంపేట హబ్‌లోనే రాత్రి బస చేస్తానని, దానికి తగిన ఏర్పాట్లు చేయాలని కడా (KADA) అధికారి వెంకట్‌రెడ్డిని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Continues below advertisement

Also Read: KTR Luxettipet Rythu Sadasu: మాది పోరంబోకు జాతి కాదు.. వలసపాలకుల సంక నాకే దగుల్బాజీ జాతి అసలే కాదు - రేవంత్‌కు కేటీఆర్ మాస్ కౌంటర్

కొడంగల్ ఎత్తిపోతల, అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష: భూసేకరణకు ఆదేశాలుమక్తల్ - నారాయణపేట్ _ కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను స్పష్టంగా ఆదేశించారు. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు పురోగతితో పాటు కొడంగల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్ట్ పురోగతిపై పిపిటి ద్వారా వివరాలను అందించారు. భూసేకరణ వేగవంతం చేసేందుకు అవసరమైన సర్వేయర్ల నియామకానికి, నిధుల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, త్వరితగతిన భూసేకరణ పూర్తి చేసి టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని స్పష్టం చేశారు.

కొడంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను శాఖల వారీగా సీఎం రేవంత్ రెడ్డి సమగ్రంగా సమీక్షించి అధికారులకు కీలక సూచనలు చేశారు. కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన, రాబోయే ఆగస్టు 30న స్వయంగా నియోజకవర్గానికి వచ్చి పనుల పురోగతిని పునఃసమీక్షిస్తానని, అక్కడే బస చేస్తానని చెప్పారు. తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, తండాలో రోడ్లు, ఇతర ప్రాథమిక మౌలిక వసతుల కల్పనపై సీఎం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఏ తండాలోనూ రోడ్డు లేదనే ఫిర్యాదు రాకూడదని, ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి ఖచ్చితంగా బీటీ రోడ్డు అనుసంధానం ఉండాలని స్పష్టం చేశారు. 

కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని, పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈఈ (EE) స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించాలని సూచించారు. మరోవైపు ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల ముప్పును దృష్టిలో ఉంచుకుని, నియోజకవర్గంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే పక్కా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.