Revanth Reddy Conducts Meet The Media: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 100 రోజులు ప్రజల కోసమే పని చేశానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం నగారా మోగించినందున ఇకపై ఎన్నికలు పూర్తయ్యే వరకు తాను పూర్తి రాజకీయ పార్టీ నాయకుడిగా పని చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అద్భుత ఫలితాలు సాధించడానికి పని చేస్తానని అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్‌లోని ఓ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీట్ ది మీడియా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి విలేకరులు వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘‘కేసీఆర్ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి. తులసి వనంలో కొన్ని కేసీఆర్ గంజాయి మొక్కలు ఇంకా వాసన వెదజల్లుతున్నాయి. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిన్న మాకు నోటీసులు ఇచ్చింది. ముందు డబ్బులు కట్టాకే జీరో విద్యుత్ బిల్లు ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. వారు ముందు సబ్సిడీ చెల్లించాకే జీరో బిల్లు ఇవ్వాలని చెబుతున్నారు. ఆ మేధావికి నేను ఒకటే చెప్తా.. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు ఈ ఆదేశం ఎందుకు ఇవ్వలేదు?
బీఆర్ఎస్ ప్రభుత్వంపై విచారణ పారదర్శకంగానే
మా పోటీ ఏపీ, కర్ణాటకతో కాదు. మా పోటీ ప్రపంచంతో ఉంటుంది. పెట్టుబడిదారులకు మేం సమాన అవకాశాలు కల్పిస్తాం. రాష్ట్రం వచ్చిన మొదట్లో ఏడాదికి రాష్ట్రం చెల్లించాల్సిన అప్పులు రూ.6 వేల కోట్లు ఉండేవి. ఇప్పుడు రాష్ట్రం ఏడాదికి చెల్లించాల్సిన అప్పులు ఏడాదికి రూ.64 వేల కోట్లకు చేరింది. పైగా గత ప్రభుత్వం వేల కోట్ల అక్రమాలకు పాల్పడింది. వాటిపై మేం విచారణకు ఆదేశించాం. ఆ విషయంలో మేం పారదర్శకంగా ముందుకు వెళ్తాం. రాజ్యాంగబద్ధంగా వారు కూడా తమ సమాధానం చెప్పుకొనే అవకాశం ఉండేలా విచారణ జరుగుతుంది.
‘‘నిజాం విధానాల నకలును కేసీఆర్ అమలు చేశారు. అందుకే ప్రజలు కేసీఆర్ విధానాలను వ్యతిరేకించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. వంద రోజుల ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించాం. గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకెళుతున్నాం. కేంద్ర ప్రభుత్వంతో, గవర్నర్ తో సామరస్యపూర్వక విధానాలతో ఉంటున్నాం. అందరి సహకారంతో ఒక మంచి పరిపాలన అందిస్తాం. వైబ్రాంట్ తెలంగాణనే మా లక్ష్యం. ప్రైవేట్ చేతిలో ఉన్న ధరణిని ప్రభుత్వ సంస్థకు అప్పగించాం. ధరణి పోర్టల్ ను ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే తప్ప అసలు విషయం బయటపడదు. తప్పులకు కారణమైన వారిని ఉపేక్షించేది లేదు’’ అని రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు.