Sigachi blast incident | పాశమైలారం: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని పాశమైలారంలో సిగాచి ఇండస్ట్రీలో జరిగిన అగ్నిప్రమాదం మృతులకు తెలంగాణ ప్రభుత్వం తక్షణసాయం ప్రకటించింది. సిగాచి కెమికల్స్ లో పేలుడు ఘటనలో మృతుల ఒక్కొక్క కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తక్షణ సాయం కింద రూ. 1 లక్ష, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సిగాచి కంపెనీ యాజమాన్యం నుంచి రూ.1 కోటి రూపాయలు, గాయపడిన వారికి రూ.5 లక్షల నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
పాశమైలారంలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం, మంత్రులు
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు మంగళవారం ఉదయం పాశమైలారంలో ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. సహాయకచర్యలను స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రమాదానికి కారణాలు, సహాయకచర్యల్లో పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిగాచిలో పేలుడుకు సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్ సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇండస్ట్రీయలో ఏరియాలోని రసాయన కంపెనీల్లో తనిఖీలు నిర్వహించి లోపాలు గుర్తించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కంపెనీలలో లోపాలను గుర్తించి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.
నిపుణులతో అధ్యయనం చేయాలని ఆదేశాలు..
నిపుణులతో అధ్యయనం చేయించి డిటైల్డ్ రిపోర్ట్ రూపొందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రమాదానికి బాధ్యులు ఎవరో తేల్చడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదం జరగకుండా చర్యలకు అవకాశం ఉంటుందన్నారు. సహాయక చర్యలకు సంబంధించి విభాగాల మధ్య సమన్వయం చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద మృతుల కుటుంబసభ్యులకు రూ.1 లక్ష, గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు. తక్షణం ఆ నగదు వారికి అందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
భారీగా పెరిగిన మృతుల సంఖ్య
పాశమైలారంలోని పారిశ్రామిక వాడలో సోమవారం సిగాచి కెమికల్స్ కంపెనీలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం రాత్రి వరకు 12గా ఉన్న మృతుల సంఖ్య మంగళవారం మధ్యాహ్నం వరకు 36కు చేరింది. సంగారెడ్డి కలెక్టరేట్ లో కంట్రోల్ రూం, హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు. సిగాచి కార్మికుల వివరాలు కోసం 08455–276155 నంబర్‌లో సంప్రదించాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య సూచించారు.