Remarks On Pragathi Bavan: ప్రగతి భవన్ ను పేల్చాలన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి సమర్థిస్తారా అంటూ ప్రశ్నించారు. టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి పై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టాలంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అలాగే మహాత్మా గాంధీ మూల సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ మార్చుకుందా అంటూ కాంగ్రెస్ నేతలను నిలదీశారు. పక్కనే ఉన్న ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. అక్కడ ప్రభుత్వ ఆఫీస్ లను కూడా ఇలాగే పేల్చాలని డిమాండ్ చేస్తారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఉన్న పీసీసీలు అందరూ రేవంత్ రెడ్డి తరహాలోనే కామెంట్లు చేస్తారా అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి క్రిమినల్ లా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తే... రేవంత్ తోడో యాత్ర అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తీవ్ర ఫ్రస్టేషన్ లో ఉన్నారని... తన ఉనికిని కాపాడుకునేందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. సంఘ విద్రోహ శక్తుల్లా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని తెలిపారు. మావోయిస్టులను రేవంత్ రెడ్డి సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. మావోయిస్టుల పై కాంగ్రెస్ స్టాండ్ ఏంటని, విధ్వంసమే మా విధానం అని చెబుతారా అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పేల్చేయడం... కుల్చేయడం అసాంఘిక శక్తుల మాటలని గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు.
డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రేజశ్వర్ రెడ్డి
మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 8వ తేదీ బుధవారం రోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో... సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పరిపాలనా కార్యాలయంతో పాటు నివాసాన్ని గ్రానైట్లు పెట్టి పేల్చాయాల్సిందిగా కోరారని వివరించారు. చట్టసభల్లో సభ్యుడిగా ఉండి.. అధికార భవనాలను కూల్చివేయమని కోరడం అంటే ఖచ్చితంగా ఇది చట్ట వ్యతిరేక చర్యగా భావించి.. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపని కోరారు.