భారత దేశ సంస్కృతి ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంది. అనేక మతాల సమ్మిళిత సంస్కృతి మన దేశంలో కనిపిస్తుంది. ఆధ్యాత్మిక అంశాల్లో చిన్న వివాదం తలెత్తినా మన దేశంలో వచ్చే స్పందన మామూలుగా ఉండదు. ఇటీవల యూనిఫాం సర్వీసుల్లో తలెత్తుతున్న మతపరమైన వివాదాలు ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మిలటరీ, పోలీసు సర్వీసు వంటివి యూనిఫాం సర్వీసుకు చెందినవి. ఇందులో క్రమశిక్షణ, ఐక్యత అనే అంశాలు అత్యంత కీలకమైనవి.
విధుల్లో మతపరమైన అంశాలు చొప్పించవచ్చా?
ఇటీవలే తెలంగాణలో కంచన్‌బాగ్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్.ఐ. కృష్ణకాంత్, అయ్యప్ప మాల వేసుకునేందుకు వీలుగా యూనిఫాం నిబంధనల్లో వెసులుబాటు కల్పించాలని ఉన్నతాధికారులకు అభ్యర్థించారు. దీనికి స్పందించిన సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం, "తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి ఉన్న ఉత్తర్వుల మేరకు అలా వెసులుబాటు కల్పించడం కుదరదు" అంటూ సమాధానం ఇచ్చింది. దీన్ని సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ కె. శ్రీకాంత్, కృష్ణకాంత్‌తో పాటు ఆ జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లకూ పంపారు. దీని కారణంగానే వివాదం చెలరేగింది.
ఆ మెమోను ఉపసంహరించుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. డీజీపీ కార్యాలయం ముందు ఇటీవలే ధర్నాకు దిగారు. ఈ క్రమంలో, వ్యక్తిగత మత విశ్వాసాలు యూనిఫాం ధరించే నిబంధనలు లేదా సంస్థాగత సంప్రదాయాలకు అడ్డుగా వచ్చినప్పుడు, న్యాయస్థానాలు దేనికి ప్రాధాన్యతనిస్తాయనే చర్చ ఇటీవల లెఫ్టినెంట్ సామ్యేల్ కమలేశన్ కేసు తీర్పు ద్వారా తేటతెల్లమైంది. ఆ తీర్పు నేపథ్యంలోనే తెలంగాణ ఎస్.ఐ.కి మెమో జారీ వివాదం కూడా తెరపైకి వచ్చింది. ఈ రెండు ఘటనలూ ఒకే ప్రాథమిక సూత్రాన్ని నొక్కి చెబుతున్నాయి: యూనిఫాం సర్వీసులో, వృత్తిపరమైన బాధ్యత, క్రమశిక్షణే వ్యక్తిగత ఆచారాల కంటే ముఖ్యమైనవి అని.
లెఫ్టినెంట్ సామ్యేల్ కమలేశన్‌కు, కృష్ణ కాంత్ వివాదానికి పోలిక ఏంటంటే?
సామ్యేల్ కమలేశన్ ఆర్మీలో లెఫ్టినెంట్ అధికారిగా ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా ప్రొటెస్టెంట్ క్రైస్తవ్యాన్ని ఆచరిస్తారు. అయితే, ఆర్మీలో సంప్రదాయంగా ఉండే రెజిమెంటల్ 'సర్వధర్మ' పూజలు నిర్వహిస్తారు. ఇందులో ఆర్మీ అధికారులు, సైనికులు పాల్గొంటారు. అయితే, లెఫ్టినెంట్ సామ్యేల్ కమలేశన్ మాత్రం సర్వధర్మ పూజ సందర్భంగా గర్భగుడిలో ప్రవేశించి, పూజల్లో పాల్గొనేందుకు నిరాకరించారు. ఇలాంటి పూజలకు క్రైస్తవ మత విశ్వాసం అంగీకరించదని ఆయన నిరాకరించారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, కానీ విగ్రహారాధనలో తాను పాల్గొననని, గుడి బయటే గౌరవంగా నిల్చుంటాననిపై అధికారులకు చెప్పారు. కానీ అందుకు ఉన్నతాధికారులు అంగీకరించలేదు. ఆర్మీ దీనిని క్రమశిక్షణారాహిత్యం, యూనిట్ సమన్వయం దెబ్బతీసే చర్యగా పరిగణించి, 2021లో ఆయనను సర్వీస్ నుంచి తొలగించింది.
న్యాయస్థానం తీర్పు ఏం ఇచ్చిందంటే ?
లెఫ్టినెంట్ సామ్యేల్ కమలేశన్ తనను విధుల నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఆర్మీ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సామ్యేల్ కమలేశన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, సుప్రీంకోర్టు కూడా ఆర్మీ నిర్ణయాన్ని, ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ కమలేశన్ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, ఈ సందర్భంగా న్యాయస్థానం ఆర్మీ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇచ్చిన తీర్పులో పలు వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యల సారాంశం ఇదే.
1. యూనిట్ కోహెషన్ ,మొరాల్ (Morale)
సైన్యంలో ఒక అధికారి తన దళంలోని ఇతర మతాల సైనికులతో కలిసి వారి ఆచారాలలో పాల్గొనడం అనేది ఐక్యత, నమ్మకాన్ని పెంచుతుంది. కమలేశన్ కేసులో సుప్రీంకోర్టు ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి సారించింది. ఒక అధికారి తన మత విశ్వాసాల కారణంగా రెజిమెంట్ సంప్రదాయాన్ని పాటించకపోతే, అది సైనికుల మధ్య విశ్వాసాన్ని, నాయకత్వాన్ని బలహీనపరుస్తుంది. యుద్ధ పరిస్థితుల్లో ఇది ప్రాణాంతకమైన ప్రభావం చూపించవచ్చు.
2. సెక్యులర్ పబ్లిక్ సర్వీస్ (Secular Public Service)
అధికారులు ప్రజలకు సేవ చేసేటప్పుడు మతపరంగా తటస్థంగా కనిపించాలి. మాలలు, స్పష్టమైన మతపరమైన చిహ్నాలు లేదా ఇతరత్రా వస్త్రధారణ విధుల్లో ఉన్నప్పుడు వారి తటస్థతపై సందేహాలను సృష్టించవచ్చు. ముఖ్యంగా మత ఘర్షణలు లేదా శాంతిభద్రతల విధుల్లో ఉన్నప్పుడు, అధికారి ఏ వర్గానికి చెందిన వ్యక్తి కాకుండా, కేవలం అధికారిగా మాత్రమే ప్రజలకు కనిపించాలి.
3. రాజ్యాంగంలో 'సహేతుకమైన ఆంక్షలు' (Reasonable Restrictions)
రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత స్వేచ్ఛను ఇచ్చినా, నైతికత దృష్ట్యా ఆంక్షలకు అనుమతిస్తుంది. యూనిఫాం సర్వీసులలోని క్రమశిక్షణ, సమన్వయాన్ని కాపాడటం అనేది రాజ్యాంగం అనుమతించిన సహేతుకమైన ఆంక్షల కిందకే వస్తుంది. మత స్వేచ్ఛ వ్యక్తిగత జీవితానికి పరిమితం, కానీ వృత్తిపరమైన డ్యూటీలో సంస్థాగత నిబంధనలే సర్వోన్నతం అని ఈ తీర్పులు స్పష్టం చేస్తున్నాయి.
మతం వ్యక్తిగతం, విధి నిబంధనలే కీలకం
యూనిఫాం సర్వీసులో ఉన్న అధికారులు, సైనికులు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే: యూనిఫాం సర్వీసులు అనేవి వ్యక్తిగత మత విశ్వాసాలకు అతీతమైనవి; విధులకు సంబంధించిన సంస్థాగత గుర్తింపుకు నిదర్శనం. సంస్థాగత ఆదేశాలను ధిక్కరించడం అనేది మతపరమైన ఉద్దేశంతో అయినప్పటికీ, అది న్యాయపరంగా క్రమశిక్షణారాహిత్యం కిందకే వస్తుంది. ముఖ్యంగా యూనిఫాం సర్వీసుల్లో ఇలాంటివి అనుమతించేది లేదని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేస్తోంది. మతపరమైన భావోద్వేగాల కన్నా వృత్తిపరమైన బాధ్యతలే అత్యున్నతమైనవి అని భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.