హైడ్రా ఏర్పాటు నుంచి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న విమర్శలు మరే ఇతర ప్రభుత్వ అధికారి గతంలో ఎన్నడూ ఎదుర్కొన్న దాఖలాలు లేవనిపిస్తోంది. తాజాగా హైకోర్టు రంగనాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఏకంగా కోర్టులో రోజంతా నిలబెడతాం, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామంటూ హైడ్రా రంగనాథ్‌పై కోర్టు కన్నెర్రజేసింది. అయితే ఈసారి హైకోర్టు వ్యాఖ్యలు చూస్తుంటే, బతుకమ్మ కుంట వ్యవహారంలో హైడ్రా రంగనాథ్‌ ప్రదర్శించిన అత్యుత్సాహమే కొంపముంచిందనే వాదనలు వినిపిస్తున్నాయి. బతుకమ్మ కుంట కబ్జా కోరల్లో చిక్కుకున్నది అనే అంశం నిర్వివాదం.

Continues below advertisement

1917 నుంచి బతుకమ్మ సంబరాలకు వేదికైన బతుకమ్మ కుంట చెరువు కబ్జారాయుళ్ల కళ్లు పడి, ఇప్పడు ఏకంగా 5 ఎకరాలు మాత్రమే మిగిలింది, అది కూడా ముళ్ల పొదలు, చెట్లు, చెత్త కుప్పలతో డంపింగ్ యార్డ్‌గా మారిపోయిందని అనేది కళ్లకు కట్టిన దృశ్యాలే. అంతలా కనుమరుగైన బతుకమ్మ కుంటను తిరిగి బతికించింది హైడ్రా, అత్యంత సుందరంగా అభివృద్ది చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ సెప్టెంబర్ 29వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వందల మహిళలతో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటేలా బతుకమ్మ కుంట చెరువు వద్ద నిర్వహించారు. దేశవ్యాప్తంగా హైడ్రా పనితీరుకు అద్దంపట్టేలా బతుకమ్మ కుంటను ప్రమోట్ చేశారు. అయితే ఇక్కడ ఒక్క లాజిక్ మాత్రం హైడ్రా రంగనాథ్ మిస్సయ్యారు. అదే కోర్టు మాట పెడచెవిన పెడుతున్నామనేది పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడు అదే హైడ్రా రంగనాథ్ కొంప ముంచింది. మేం తలచకుంటే రోజంతా కోర్టులో నిలబెడతాం, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తాం అంటూ కోర్టు కన్నెర్రజేసే పరిస్ధితి రంగనాథ్ ఎదుర్కోవలసి వచ్చింది.

బతుకమ్మ కుంట అభివృద్ది జరిగిపోయింది. సీఎం సమక్షంలో సంబరాలు చేశారు. ఇంకేముంది అనే సందేహం అందరిలో ఉండొచ్చు. కానీ అసలు కథ ఇంకా మిగిలే ఉంది అంటున్నారు పిటీషనర్ యడ్ల సుధాకర్ రెడ్డి. బతుకమ్మ కుంట చెరువు స్థలం నాదంటూ ఆధారాలతో కోర్టును ఆశ్రయించిన సుధాకర్ రెడ్డి, ఈ విషయంలో తగ్గేదే లేదంటూ ఏళ్లతరబడి పోరాటం చేస్తూనే ఉన్నాడు. నిజాం నవాబు ఐదు కూతుళ్లలో ఓ కూతురు మనవడు, తనకు బతుకమ్మ కుంట స్థలం అమ్మాడని, అతను సంతకాలు చేసిన సేల్ డాక్యుమెంట్ ఉందని, నా స్థలంలో బతుకమ్మ కుంట చెరువును అభివృద్ది చేయడమేంటి అనేది పిటీషనర్ వాదన.

Continues below advertisement

బతుకమ్మ కుంటలో రంగనాథ్ చేసిన తప్పు ఇదే..

బతుకమ్మ కుంట స్థలం వివాదంలో హైడ్రా వర్సెస్ పిటీషనర్ యడ్ల సుధాకర్ రెడ్డి వాదనలు విన్న హైకోర్టు జూన్ 12వ తేది కీలక ఆదేశాలు జారీ చేసింది. బతుకమ్మ కుంట చెరువు వద్ద ఎలాంటి పనులు చేపట్టవద్దని, యధాతథ పరిస్థితి కొనసాగించాలని స్పష్టంగా చెప్పింది. ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వ సహకారంతో హైడ్రా తన పని తాను చేసుకుపోయింది. అత్యంత సుందరంగా బతుకమ్మ కుంట చెరువును అభివృద్ది చేసింది. చుట్టూ వాకింగ్ ట్రాక్, ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ , ఫ్లడ్ లైట్లు, చెరువు చుట్టూ భారీ ఇనుప కంచె, కట్టుదిట్టంగా ముఖద్వారం .. ఇలా వారెవ్వా ఏం చేశారబ్బా అనేంతలా బతుకమ్మ కుంట చెరువును ఓ రేంజ్‌లో అభివృద్ది చేసింది హైడ్రా. ఇదే .. ఈ స్పీడు ఇప్పడు కోర్టు ఆగ్రహానికి ప్రధాన కారణమైంది. ఎలాంటి పనులు చేయొద్దని చెబితే , కోర్టు ఆదేశాలు లెక్కచేయలేదంటూ పిటీషనర్ కోర్టును ఆశ్రయించడంతోపాటు నిర్మాణపనులు ఫొటోలు తీసి ,ఆధారాలు కోర్టుకు సమర్పించాడు. అక్టోబర్ 31న విచారణ చేపట్టిన ధర్మాసనం, నవంబర్ 27 హైడ్రా రంగనాథ్ స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని, కోర్టు ఆదేశాలు ఎందుకు దిక్కరించారో చెప్పాలంటూ ఆదేశించింది. 

అలా  తాజాగా ఈనెల 27న హైకోర్టు రావాల్సిన హైడ్రా రంగనాథ్ మళ్లీ పొరపాటు చేశారు. ఇప్పటికే కోర్డు ధిక్కరణ ఆరోపణలున్నాయని తెలిసినా, నేను స్వయంగా హాజరుకాలేను, మళ్లీ సమయం కావాలి, ఇప్పుడు కాస్త బిజీ అంటూ వక్తిగత హాజరుకు మినహాయింపు కోరుతూ పిటీషన్ దాఖలు చేశాడు. ఈ పిటీషన్ పై విచారించిన కోర్టు రంగనాథ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 5వ తేది కోర్టుకు రాకపోతే ఇక నాన్ బెయిలబుల్ అరెస్ట్ అంటూ హెచ్చరించింది. ఇలా హైడ్రా రంగనాథ్ బతుకమ్మ కుంట చెరువు సాక్షిగా కొత్తచిక్కులు కొనితెచ్చుకున్నారు. రంగనాథ్ వివరణకు కోర్టు శాంతిస్తుందా లేక కోర్టు ధిక్కారణ నేరం క్రింద చర్యలు తీసుకుంటుందా అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. 

రంగనాథ్ ఏమంటున్నారంటే..

హైడ్రా ఏర్పాటు చేసిన నాటి నుండి ఇప్పటి వరకూ నాపై వ్యక్తిగతంగా 30కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా హైడ్రాపై 100కుపైగా కేసులు పెట్టారు. చెరువులను ఆక్రమణల నుండి రక్షించడం అంటే సాధారణ విషయంకాదు. బడా బాబులు ప్రమేయం లేకుండా ఎక్కడా ఆక్రమణలు జరగలేదు. దాదాపు 65శాతం చెరువులు ఇప్పటికే ఆక్రమణలకు గురయ్యాయి. నాపై కేసులు, విధినిర్వహణలో భాగంగానే జరిగాయి. డిసెంబర్ 5వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతాను. బతుకమ్మ కుంట వివాదంపై వివరణ ఇస్తాను. చట్టపరంగా నాపై కేసును ఎదుర్కొనేందుకు పోరాటం చేస్తాం.