రైతుబంధు డబ్బులు కేసీఆర్‌ ఇంట్లోనివి కావని.. తెలంగాణ ప్రజల చెమట నుంచి డబ్బులు వచ్చాయని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. తనకు, తనలాంటి వారికి కూడా రైతుబంధు ఇవ్వడం సమంజసమా? అని ఈటల ప్రశ్నించారు. రైతు కూలీలు, కౌలు దారులను కేసీఆర్‌ విస్మరించారని.. ఈటల గుర్తు చేశారు. హైదరాబాద్‌లో తెలంగాణ జర్నలిస్టుల యూనియన్‌ గురువారం నిర్వహించిన మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో ఈటల రాజేందర్‌ మాట్లాడారు.


గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు తనతో పాటు పలువురు నేతలు కూడా ఓ సందర్భంలో వెళ్లామని.. ఆ సమయంలో అడ్డుకున్నప్పుడే ఆత్మగౌరవం దెబ్బతిన్నదని ఈటల రాజేందర్ గుర్తు చేసుకున్నారు. తాను టీఆర్ఎస్ పార్టీలో ఉండగా, ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో మంత్రివర్గ భేటీకి ముందే అనేక నిర్ణయాలు తీసేసుకునేవారని చెప్పారు. వందల ఎకరాలు ఉన్నవారికి రైతుబంధు ఎందుకని తాను ఆ సమయంలోనే ప్రశ్నించానని ఆయన గుర్తుచేసుకున్నారు.


కేసీఆర్‌పై పోటీకి సిద్ధం
బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీకి సిద్ధమని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. ఇక టీఆర్ఎస్‌తో కొట్లాటే.. తెలంగాణలో అధికారం బీజేపీదే అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవానికి ఖరీదు కట్టిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. మెజార్టీ టీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. ఇక టీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదని అక్కడి నేతలే అంటున్నారు. బీజేపీలో గ్రూపులు లేవని... బండి సంజయ్‌తో వైరం లేదని తేల్చిచెప్పారు. థర్డ్ ఫ్రంట్ సంగతి వదిలి ముందు రాష్ట్రాన్ని కేసీఆర్ చక్కదిద్దాలని ఈటల హితవు పలికారు. తాను కాంగ్రెస్‌లోకి వెళ్తానని కేసీఆరే ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.


‘‘తెలంగాణ బిడ్డల రక్తం కళ్ల చూసిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారు. హుజూరాబాద్‌లో రూ.600 కోట్ల బ్లాక్ మనీ నన్ను ఓడించడం కోసం ఖర్చు పెట్టారు. అంత డబ్బు అసలు కేసీఆర్‌కు ఎలా వచ్చింది? హోదాకు, ఆత్మ గౌరవానికి కేసీఆర్‌ ఖరీదు కట్టారు. దళితులపై ప్రేమతో దళిత బంధు తీసుకొని రాలేదు. ఓట్ల కోసమే ఆ పథకం తీసుకొచ్చారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. దళిత బంధు గురించే మర్చిపోయారు. సీఎంను కలవడానికి ఒక్క సంఘానికైనా అనుమతి ఇచ్చారా? హుజూరాబాద్‌ తీర్పుతో ఫామ్‌ హౌస్‌ నుంచి బయటకొచ్చారు’’ అని ఈటల రాజేందర్ అన్నారు.


Also Read: Farmer Suicide: కన్నబిడ్డలా చూసుకున్న పంట ఒడిలోనే.. రైతు రవీందర్ ఆత్మహత్య.. 


Also Read: Kurnool Onion Market: గిట్టుబాటు ధరలేక ఆగ్రహించిన ఉల్లి రైతు... పెట్రోల్ పోసి ఉల్లిబస్తాలకు నిప్పు


Also Read: YS Sharmila: వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు..  త్వరలో పాదయాత్ర చేస్తా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి