Welspun Group Iinvestments in Telangana: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రూపురేఖల మారిపోతున్నాయని, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాలను సైతం తక్కువ సమయంలో పూర్తి చేశామన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా చందన్ వెల్లి పారిశ్రామిక వాడలో వెల్ స్పన్ అడ్వాన్స్ డ్ మెటీరియల్ లిమిటెడ్ యూనిట్‌ను బుధవారం నాడు మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనతో గుజరాత్ నుంచి తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల కిందట చందనవెల్లిలో ఒక్క పరిశ్రమ కూడా లేదు, ఇప్పుడు ఈ ప్రాంతానికి పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు.
గుజరాత్ నుంచి వచ్చిన వెల్ స్పన్ కంపెనీ భారీ పెట్టుబడి పెట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో గుజరాత్ సంస్థ వెల్ స్పన్ దాదాపు రూ.5 వేల కోట్ల పెట్టుబడికి సిద్ధంగా ఉందన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలను పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. చందన్ వెల్లి పారిశ్రామిక వాడలో వెల్ స్పన్ అడ్వాన్స్ డ్ మెటీరియల్ లిమిటెడ్ యూనిట్‌ను మంత్రి కేటీర్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రజా ప్రతినిధులు, వెల్ స్పన్ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఐదేళ్ల కింద చందన్ వెల్లిలో ఒక్క పరిశ్రమ లేదు
5 ఏళ్ల కింద చందన్ వెల్లిలో ఒక్క పరిశ్రమ కూడా లేదని, టీఆర్ఎస్ పాలనతో పరిస్థితులు మారాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. ప్రపంచ స్థాయి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. కేవలం నాలుగేళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం పూర్తి చేసిన ఘనత తమ సొంతం అన్నారు. కొన్ని కారణాలతో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతున్నాయని, త్వరలోనే అతిపెద్ద పారిశ్రామిక హబ్ గా తెలంగాణ మారుతుందని దీమా వ్యక్తం చేశారు.
గుజరాత్ కంపెనీ వెల్‌స్పన్ తెలంగాణకు వచ్చి చందన్ వెల్లిలో 3000 నుంచి 5000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైందన్నారు. పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణకు ఎంచుకున్నందుకు వెల్ స్పన్ సంస్థ అధినేత బాలకృష్ణ గోయెంకాకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టి చందన్ వెల్లిని వెల్ స్పన్ వ్యాలీగా మారుస్తామని గోయెంకా అన్నారు. సీఎం కేసీఆర్ పాలన, దార్శనికతతో రాష్ట్రంలో మరిన్ని రంగాల్లో అగ్రగ్రామిగా నిలుస్తుందని ప్రశంసించారు.