Rangareddy District Court: ఇబ్రహీంపట్నం కర్ణంగూడ కాల్పుల కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చింది. మట్టారెడ్డి, ఖాజా మొయినుద్దీన్‌, భిక్షపతిలకు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. 2022 మార్చిలో  క‌ర్ణంగూడ వ‌ద్ద కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. స్కార్పియో కారులో వెళ్తున్న ఇద్దరు రియ‌ల్టర్లపై గుర్తు తెలియ‌ని వ్యక్తులు కాల్పులు జ‌రిపారు. కాల్పుల్లో రియ‌ల్టర్ న‌వార్ శ్రీనివాస్ రెడ్డి అక్కడిక‌క్కడే మృతి చెంద‌గా, కోమ‌టిరెడ్డి రాఘ‌వేంద‌ర్ రెడ్డి బీఎన్ రెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.


రియల్ వ్యాపారం నేపథ్యంలోనే హత్య


కాల్పులకు భూ వివాదాలే కారణమని తేలింది. శ్రీనివాస్ రెడ్డి, రాఘ‌వేంద‌ర్ రెడ్డి, మ‌ట్టారెడ్డి క‌లిసి ఇబ్రహీంప‌ట్నం ప‌రిధిలోని లేక్ వ్యూస్‌కు స‌మీపంలో ప‌టేల్‌గూడ‌లో 22 ఎక‌రాల్లో ఓ వెంచ‌ర్ వేశారు. ఈ వెంచ‌ర్ విష‌యంలో మ‌ట్టారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాఘ‌వేంద‌ర్ రెడ్డి మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా వివాదాలు కొన‌సాగుతున్నాయి. ఘటన జరిగిన రోజు ఉద‌యం 5 గంట‌ల‌కు ఇంట్లో నుంచి శ్రీనివాస్ రెడ్డి, రాఘ‌వేంద‌ర్ రెడ్డి వెళ్లారు. ఆ స‌మ‌యంలోనే శ్రీనివాస్ రెడ్డి, రాఘ‌వేంద‌ర్ రెడ్డిపై గుర్తు తెలియ‌ని వ్యక్తులు కాల్పులు జ‌రిపిన‌ట్లు వారి స‌న్నిహితులు పేర్కొన్నారు. 


మ‌ట్టారెడ్డి పిల‌వ‌డం వ‌ల్లే వీరిద్దరూ బ‌య‌ట‌కు వెళ్లిన‌ట్లు వారి కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. భూ వివాదాల కార‌ణంగానే మ‌ట్టారెడ్డి.. మిగ‌తా ఇద్దరిపై కాల్పులు జ‌రిపిన‌ట్లు మృతుడి కుటుంబ స‌భ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మ‌ట్టారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిని హతమార్చేందుకు మట్టారెడ్డి తన వద్ద పనిచేసే ఖాజా మొయినుద్దీన్‌, భిక్షపతిని ప్రేరేపించాడు.


దీంతో శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిని హతమార్చేందుకు వారు స్కెచ్ వేశారు. ఉదయాన్నే బయటకు పిలిపించి తుపాకీతో శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించారు. ప్రధాన నిందితుడు మట్టారెడ్డితో పాటు కాల్పులు జరిపిన ఖాజా మొయినుద్దీన్‌, భిక్షపతిని అదే నెల 3న పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో పూర్తి ఆధారాలతో పాటు సాక్షులను ప్రవేశపెట్టారు. విచారణ నిర్వహించిన కోర్టు ముగ్గురినీ దోషులుగా తేల్చి.. జీవితఖైదు విదిస్తూ తీర్పు ఇచ్చింది.


పరువు హత్య కేసులో తీర్పు


హైదరాబాద్‌ సరూర్ నగర్ లో సంచలనం సృష్టించిన నాగరాజు హత్య కేసులో రంగారెడ్డి కోర్టు ఇదే నెలలో తీర్పు వెలువరించింది. నిందితులకు జీవిత ఖైదు విధించింది. రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన బిల్లారపురం నాగరాజు, మర్పల్లి సమీపంలోని ఘనాపూర్‌ వాసి ఆశ్రిన్‌ సుల్తానా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీంతో మతాంతర వివాహం చేసుకున్నారనే కోపంతో యువతి సోదరుడు మోబిన్ అహమ్మద్ నడిరోడ్డుపై నాగరాజును గత ఏడాది మే 4న దారుణంగా హత్య చేశాడు. 


ఈ కేసులో ఏ-1 మోబిన్ అహమ్మద్, ఏ-2 మసూద్ అహ్మద్ ఉన్నారు. పోలీసులు 120బి, 341, 302, రెడ్ విత్ 34, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. నిందితులైన మోబిన్ అహమ్మద్, మసూద్ అహ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. విచారణలో నిందితులు హత్య చేసినట్లు తేలడంతో వారికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఇద్దరు నిందితులకు జీవిత ఖైదుతోపాటు రూ.1000 జరిమానా విధించారు.