Rajya Sabha :అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు మధ్య రాష్ట్రంలోమరో  చిన్నపాటి ఎన్నికల సమరం నడవనుంది. తెలంగాణ(Telangana) నుంచి  మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండగా  ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్లు దాఖలకు రేపే ఆఖరి తేది కావడంతో నేడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. సంఖ్యాపరంగా చూసుకుంటే  కాంగ్రెస్(Congress) రెండు, బీఆర్ఎస్(BRS) ఒక సీటు  దక్కించుకునే అవకాశం. అయితే ఇటీవల బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు పెద్దఎత్తున వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Redy)ని కలవడం..కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి దాదాపు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లోఉన్నారని ప్రకటించడం చూస్తే....మూడోసీటుకు  కూడా కాంగ్రెస్ పోటీపడుతుందేమో చూడాలి.


రాజ్యసభ సమరం
రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ(Rajya Sabha) స్థానాలకు కాంగ్రెస్‌(Congress), బీఆర్‌ఎస్‌(BRS) పార్టీలు బుధవారం తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు అధికార కాంగ్రెస్‌ పార్టీకి, ఒకటి ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు దక్కనున్నది. నామినేషన్ల దాఖలుకు గురువారం చివరి తేదీ కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు నేడు తమ అభ్యర్థులను  ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 11 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైనప్పటికీ ఇప్పటికీ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ లో ఆశావాహులు ఎక్కువగా ఉండటం..గత ఎన్నికల సమయంలో టిక్కెట్ల దక్కని వాళ్లకు పార్టీ చాలా విధాల ప్రామెస్ చేసి ఉండటంతో...తొలి కోటాలోనే రాజ్యసభ సీటు దక్కించుకునేందుకు  పెద్దఎత్తున పైరవీలు చేస్తున్నారు. అటు ప్రతిపక్ష బీఆర్ ఎస్ నుంచీ సీనియర్ నాయకులు టిక్కెట్ కోసం వేచిచూస్తున్నారు. 


మూడోసీటు కోసం పోటీ పడేనా
సంఖ్యాపరంగా చూస్తే కాంగ్రెస్(Congress) రెండు సీట్లు, బీఆర్ఎస్(మ) ఒకస్థానం దక్కించుకోవాలి. కేవలం మూడు నామినేషన్లు మాత్రమే దాఖలైతే  ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయి. కానీ మూడోసీటు కోసం కాంగ్రెస్ పోటీపడితే మాత్రం ఎన్నికలు నిర్వహించక తప్పదు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లు చూస్తుంటే...సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మూడోసీటు పైనా కన్నేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగానే  కలిశామని వారు చెబుతున్నా....గులాబీపార్టీ గుండెల్లో మాత్రం దడ పుడుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఏకంగా 20 మంది బీఆర్ఎస్( BRS) ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని  ప్రకటించడంతో గులాబీ బాస్ ఉలిక్కిపడ్డారు. వీరంతా లోక్ సభ ఎన్నికల వరకు ఉంటారా లేక ఇప్పుడే జంప్ అవుతారా అన్న ఆందోళన నెలకొంది. అయితే కాంగ్రెస్ కు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి ఏఐసీసీ(AICC) కోటా నుంచి, మరొకటి టీపీసీసీ(TPCC) నుంచి ఎంపిక చేయనున్నట్టు అధిష్ఠానం ఇదివరకే స్పష్టం చేసింది.  ఏఐసీసీ కోటాలో రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో ఒకరు ఏఐసీసీ కోశాధికారి, సీడబ్ల్యూసీ సభ్యుడు అజయ్‌మాకెన్‌(Ajay Maken) కాగా, మరొకరు కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టో సభ్యురాలు సుప్రియ(Supriya) ఉన్నారు. పార్టీ అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేసేది బుధవారం తేలిపోనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ దక్కని మాజీ మంత్రులు చిన్నారెడ్డి(Chinnareddy), జానారెడ్డి(Janareddy), మాజీ ఎంపీ వి.హనుమంతరావు, చల్లా వంశీచందర్‌రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి(Renuka Chowdary), మాజీ ఎంపీ విజయశాంతి (Vijayasanthi) పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్యసభకు రాష్ట్రం నుంచి ఎంపికయ్యే అభ్యర్థిని ఇప్పటికే అధిష్ఠానం ఎంపిక చేసిందని, ఆశావహులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల పార్టీ గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ఏదీ ఏమైనా ఇవాళ ఆ పేరు బయట పెట్టక తప్పని పరిస్థితి.


బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరో..?
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందరికన్నా ముందే అభ్యర్థులను ప్రకటించి రేసులో ముందు నిలవడం గులాబీ బాస్ కు అలవాటు. కానీ ఈసారి రాజ్యసభ అభ్యర్థి పేరు ఇప్పటికీ గుట్టుగానే ఉంచారు. సంఖ్యాపరంగా  కేవలం ఒక్క రాజ్యసభ సీటే దక్కే అవకాశం ఉండటంతో...ఈ ఒక్కటీ ఎవరికి ఇవ్వాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు.  త్వరలో పదవీకాలం ముగియనున్న ముగ్గురు రాజ్యసభ సభ్యుల్లో సంతోష్‌కుమార్‌(Santhosh), బడుగుల లింగయ్యయాదవ్‌(Lingaiah Yadhav), ఒద్దిరాజు రవిచంద్ర(Ravichandra) ఉన్నారు. వీరిలో రవిచంద్ర పదవీ కాలం రెండేండ్లకే ముగియనుండటంతో ఖాళీ అయ్యే స్థానానికి తననే ఎంపిక చేస్తారని ఆశిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం మాత్రం ఇప్పటి వరకు ఎవరినీ ప్రకటించలేదు. బీఆర్ఎస్ అభ్యర్థిని నేడు ప్రకటిస్తారా లేక..రేపటి వరకు సమయం ఉంది కాబట్టి చివరి నిమిషంలో రంగంలోకి దింపుతారా అన్నది తేలాల్సి ఉంది.