Ex CI Nageshwar Rao Case: వనస్థలిపురం మాజీ సీఐ నాగేశ్వర్ రావు కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దాదాపు 600 పేజీల ఛార్జ్ షీట్ ను రాచకొండ పోలీసులు ఎల్బీ నగర్ కోర్టులో ఫైల్ చేశారు. ఇందులో 75 మంది సాక్షులను చేర్చారు. రేప్ అండ్ కిడ్నాప్ కేసులో నాగేశ్వర్ రావు కొద్ది నెలల కిందట అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం రెండు నెలల పాటు నాగేశ్వర్ రావు జైల్లో ఉన్నారు. ఇటీవలే బెయిల్ పైన విడుదల అయ్యారు.


ఈ కేసు విషయం వెలుగులోకి రాగానే నాగేశ్వర్ రావును హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. తాజాగా రెండు రోజుల క్రితమే పూర్తిగా సర్వీస్ నుండి నాగేశ్వరరావును పోలీసు ఉన్నతాధికారులు తొలగించారు. నాగేశ్వర్ రావు రేప్ అండ్ కిడ్నాప్ కేస్ లో అన్ని సాక్ష్యాలను పోలీసులు కోర్టులో సమర్పించారు. తాజాగా దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లోనూ అన్ని అంశాలను పోలీసులు పొందుపరిచారు. నిందితుడు పాల్పడ్డ నేరాలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ వివరాలు, డీఎన్ఏ రిపోర్ట్ లు, యాక్సిడెంట్ అయిన వివరాలు, వెపన్ దుర్వినియోగం వివరాలు, బాధితురాలి స్టేట్ మెంట్ లను ఛార్జ్ షీట్ లో పోలీసులు పొందుపరిచారు. నాగేశ్వర్ రావుకు తగిన శిక్ష పడేలా కోర్ట్ లో అన్ని ఆధారాలను పోలీసులు సమర్పించారు.


మ్యాచ్ అయిన రిపోర్టులు


జులై 7న వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో నాగేశ్వరరావుపై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తనపై అత్యాచారం చేయడంతో పాటు కిడ్నాప్ చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు జులై 11న నాగేశ్వరరావును అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. ఆ తర్వాత అదే నెల 18వ తేదీన పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని ఐదు రోజుల పాటు విచారణ చేశారు. నాగేశ్వరరావు అత్యాచారం చేశారనడానికి తగిన ఆధారాలు సేకరించారు. ఆ మహిళ లోదుస్తుల్లోని నమూనాలు సేకరించి, నాగేశ్వర్ రావు DNA తో సరిపోల్చారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో ఈ రెండు మ్యాచ్ అయ్యాయి.


అంతేకాకుండా, సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను కూడా పరిశీలించారు. నాగేశ్వర్ రావు సెల్ ఫోన్ లోని డేటాను, ఛాటింగ్ వివరాలను విశ్లేషించి, అత్యాచారం జరిగిన సమయంలో నాగేశ్వరరావు ఆ మహిళ ఇంట్లోనే ఉన్నట్లు ఓ నిర్ధారణకు వచ్చారు. మహిళ నివాసం ఉండే ఇంటి సెక్యురిటీతో పాటు చుట్టుపక్కల వాళ్ల సాక్ష్యాలను కూడా నమోదు చేశారు. ఈ సాక్ష్యాలు అన్నింటినీ పోలీసులు ఛార్జిషీటులో పొందుపర్చారు. ఈ కేసు విచారణ ఎల్బీ నగర్ కోర్టులో కొనసాగుతోంది.


ఉద్యోగం నుంచి తీసేస్తూ ఉత్తర్వులు


ఆయనపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో  875/2022 U/s 452, 376 (2), 307, 448, 365 IPC sec C of  Arms act 1959  సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసు డిపార్ట్‌మెంట్ అతనికి ఇచ్చిన అధికారాన్ని హద్దులేని దుర్వినియోగం చేసినట్టు నిర్దారించి సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.