తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటిదాకా ప్రధాన రాజకీయ పార్టీల నేతల నడుమ వాగ్యుద్ధాలే నడిచాయి. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం రోజూ జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ప్రత్యర్థి పార్టీలను దిగజార్చే ఉద్దేశంతో రకరకాల పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. తాజాగా ఈ వాగ్యుద్ధాలు కాస్తా కొట్టుకొనేవరకూ వెళ్లింది. ఇద్దరు నేతలు పరస్పరం దాడి చేసుకున్నారు. అది కూడా ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో ఈ పరిణామం జరిగింది.


తెలుగులో ఓ ప్రధాన వార్తా ఛానెల్ గెలుపెవరిది పేరుతో వివిధ నియోజకవర్గాల్లో డిబేట్లు నిర్వహిస్తూ ఉంది. ఆ డిబైట్ ను తమ ఛానెల్ లో లైవ్‌లో ప్రసారం చేస్తూ ఉంది. అలా ఆ డిబేట్‌ను కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో నిర్వహించారు. లైవ్‌ డిబేట్‌ సందర్భంగా కుత్బుల్లాపూర్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతున్నారు. వీరి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం చేయిదాటిపోయి ఏకంగా దాడి చేసుకొనేవరకూ పరిస్థితి వెళ్లింది. ఈ క్రమంలోనే ఇద్దరు ఘర్షణ పడ్డారు.


ఈ డిబేట్‌లో తొలుత సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద శ్రీశైలం గౌడ్‌ పై దాడి చేశారు. ఆయన గొంతును కూడా పట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వెంటనే వేదికపైకి చేరుకొని వారిద్దరిని అడ్డుకుని విడదీశారు. నాయకుల మధ్య ఘర్షణ జరగడంతో ఇరు పార్టీల కార్యకర్తలు కూడా ఒకరిపై మరొకరు దాడి చేసుకొనేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని కూడా ఆపగలిగారు.