TSPSC Paper Leakage: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ తెలంగాణలో పెను దుమారమే రేపుతోంది. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ నేతలంతా రోడ్లెక్కుతున్నారు. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. షర్మిలను కూడా అరెస్టు చేశారు. ఇప్పుడు బండి సంజయ్ కూడా ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు.
పేపర్ లీకేజీ కేసును సీబీఐకు అప్పగించాలన్న డిమాండ్‌తో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వానికి ప్రవీణ్ కుమార్ ఇచ్చిన 48 గంటల సమయం ముగియడంతో.. లక్డీకాపూల్ బీఎస్పీ కార్యాలయంలో నిరవధిక దీక్షకు దిగారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం ఇంటికి తరలించారు.
ప్రవీణ్ కుమార్ దీక్షకు మద్దతు తెలిపేందుకు బీఎస్పీ కార్యకర్తలు, ప్రవీణ్ కుమార్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. వారందర్నీ పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఎస్పీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ వీడియోను విడుదల చేశారు.
30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని తమ పార్టీ కార్యాలయంలో శాంతియుతంగా చేస్తున్న దీక్షను సీఎం కేసీఆర్ తన పోలీసుల ద్వారా భగ్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ నిరవధిక దీక్ష అపేది లేదని స్పష్టం చేశారు. గ్రూప్ - 1తో పాటు ఏయే పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజీ అయ్యాయో ఆ పరీక్షలను రద్దు చేయాలన్నారు. టీఎస్ పీఎస్సీ మీద అభ్యర్థులకు విశ్వాసం పోయిందని వెంటనే టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేసి పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ను అంతా పూర్తిగా ప్రక్షాళ చేయాలని అన్నారు. అప్పటి వరకు తమ దీక్ష కొనసాగుతుందని చెప్పారు.
షర్మిల గృహనిర్బంధం..!
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా టీఎస్పీఎస్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా వైఎస్ షర్మిల ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గృహనిర్బంధం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో మరిన్ని ప్రశ్నాపత్రాలు
టీఎస్‌పీఎస్సీ ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించనున్న పరీక్షల షెడ్యూలు మారే అవకాశం ఉంది. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన నిందితుడి వద్ద త్వరలో నిర్వహించాల్సిన పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్లు దర్యాప్తులో బయటపడినట్లు సమాచారం. ఇప్పటికే సిద్ధం చేసిన ప్రశ్నపత్రాల స్థానంలో కొత్తవి సిద్ధం చేయనున్నట్లు రెండు రోజుల క్రితం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్ రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పారు. కొత్త ప్రశ్నపత్రాలను సిద్ధం చేయడానికి, ప్రింటింగ్ చేయడానికి కొంత సమయం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్; మే నెలల్లో టీఎస్‌పీఎస్సీ షెడ్యూలు చేసిన తొమ్మిది రకాల పోస్టుల పరీక్షలు రీషెడ్యూలు అయ్యే అవకాశాలున్నట్లు తెలిసింది.
నాలుగు పెన్‌డ్రైవ్‌లలో 60 జీబీ పైగా డేటా..
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్ దర్యాప్తులో సంచలన అంశాలు బయటపడుతున్నాయి. కేసులో కీలక నిందితుడు, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు ప్రవీణ్ నుంచి స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్‌లలో ఉన్న సమాచారాన్ని విశ్లేషించే పనిలో సిట్ నిమగ్నమైంది. నాలుగు పెన్‌డ్రైవ్‌లలో 60 జీబీకి పైగా సమాచారమున్నట్లు వెల్లడైంది. ఆ డేటాను విశ్లేషించడంతోపాటు, డెలిట్ చేసిన డేటాను తిరిగి రాబట్టడంపైనా విచారణ అధికారులు దృష్టి సారించారు. ప్రాథమిక దర్యాప్తు క్రమంలో కీలక సమాచారం సిట్ చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. సీజ్ చేసిన పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్, సెల్‌ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపిన సిట్.. వాటిలోని ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఇప్పటికే కొంత అంచనాకు వచ్చింది.