Narendra Modi And Ramoji Rao : రామోజీరావు మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎప్పుడూ దేశాభివృద్ధి కోసం ఆలోచించే రామోజీరావు లేని లోటు పూడ్చలేనిది అన్నారు. సినీ, మిడీయా రంగంలో చెరగని ముద్రవేశారని అభిప్రాయపడ్డారు. మీడియాను విప్లవాత్మకంగా మరాచిన దార్శనికుడని కీర్తించారు. సరికొత్త ప్రయోగాల చేస్తూ ప్రమాణాలతో నడిపిన మహా శక్తిగా అభివర్ణించారు. 


"రామోజీ రావు మరణించడం చాలా బాధాకరం. భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడాయన. ఆయన పని తీరు జర్నలిజం చలనచిత్ర ప్రపంచంపై చెరగని ముద్ర వేసింది. ఆయన సేవలతో మీడియా,  ఎంటర్‌టైన్మెంట్ ప్రపంచంలో ప్రమాణాలు పాటిస్తూనే ఆవిష్కరణలు చేస్తూ  కొత్త ప్రమాణాలు నెలకొల్పారు.


రామోజీ రావు భారతదేశ అభివృద్ధిపై చాలా ఆసక్తి. ఆయనతో మాట్లాడటం ఆయన నుంచి చాలా నేర్చుకునే అవకాశాలు పొందడం నా అదృష్టం. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను." 






ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి. మీడియా రంగంలో విలువలతో కూడిన నూతన ఒరవడికి, ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు రామోజీరావు అని గుర్తుచేసుకున్నారు. " మీడియా మేరునగధీరుడిగా, సమాచార రంగంలో విలువలతో కూడిన నూతన ఒరవడులకు, ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహనీయుడు రామోజీరావు ఇక లేరని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేస్తూ.. ఎందరోమంది జీవితాల్లో వెలుగులు నింపిన రామోజీరావు అస్తమయం.. తెలుగు మీడియా రంగానికి, టీవీ పరిశ్రమకు, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. రామోజీ రావు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. "


 






అక్షర ఆధిత్యుడిగా ప్రత్రికారంగంలో తనపైన ముద్రవేసుకున్న రామోజీరావు మరణం ఆవేదన కలిగించిందన్నారు ఎంపీ బండి సంజయ్‌..."ఆధునిక జర్నలిజానికి పితామహుడు.. తెలుగు జాతి గర్వించదగ్గ మేరునగధీరుడు.. అక్షర ఆధిత్యుడిగా పత్రికా రంగంలో ఉన్నత విలువలను పెంచిన.. పంచిన యోధుడు.. ఆఖరి క్షణం వరకు శ్రమనే ఊపిరిగా జీవించిన నిత్య కృషివలుడు..లక్షలాదిమంది ఉద్యోగులకు విలువలతో కూడిన జీవితాన్ని అందించిన మహానీయుడు.. క్రమశిక్షణ గల అక్షర సైనికులను తీర్చి దిద్దిన మహానేత... పద్మ విభూషణ గ్రహీత.. ఈనాడు, ఈటీవీ, మార్గదర్శి సంస్థల అధినేత రామోజీరావు మహాభినిష్ర్కమణం చాలా ఆవేదన కలిగించింది." అని ట్వీట్ చేశారు.