ప్రధాన మంత్రి మోదీ తెలంగాణ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 19న హైదరాబాద్‌లో పర్యటించాల్సి ఉంది. వందేభారత్‌ రైలుతోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ పర్యటన వాయిదా పడినట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాకు సమాచారం ఇచ్చారు. కొత్త షెడ్యూల్ త్వరలోనే తెలియజేస్తామంటూ వివరించారు. 


హైదరాబాద్ నుంచి విశాఖ పట్నానికి పరుగులు పెట్టనున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి 19న ప్రారంభించాల్సి ఉంది. అదే రోజు సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయాల్సి ఉంది. రాష్ట్రంలోనే అతి పెద్ద స్టేషన్ సికింద్రాబాద్ ను 699 కోట్ల రూపాయల వ్యయంతో పనరాభివృద్ధి చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న భవనాల్ని కూల్చి అంతర్జాతీయ ప్రమాణాలు, పూర్తిస్థాయి వసతులతో నూతనంగా నిర్మిస్తారు. అయితే ఇందుకోసం గుత్తెదారు ఎంపిక అక్టోబరులోనే పూర్తి అయింది. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారని షెడ్యూల్‌ను ముందుగా ప్రకటించారు. కానీ సడెన్‌గా పర్యటన వాయిదా పడింది. 


ఈనెలాఖరుకు తెలంగాణ రానున్న అమిత్‌షా


ఈనెల 28వ తేదీన బీజేపీ అగ్రనేత, కేంద్రం హోమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర పార్టీ ఎన్నికల కోసం ఏ మేర సిద్ధం అయిందో పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్ సభ, 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని బూత్ కమిటీలు, మండల, ఇతర స్థాయిల కమిటీల నియామకం తదితర విషయాలపై సమీక్షిస్తారు. అవసరం అయితే అమిత్ షా 29వ తేదీ రోజు ఇక్కడే ఉంటారు. నాలుగేసి లోక్ సభ నియోజక వర్గాలను కపిలి ఒక క్లస్టర్ గా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా కనీసం రెండు క్లస్టర్ సమావేశాల్లో పాల్గొని సంస్థాగత ఎన్నికల సన్నద్ధతను పరిశీలించనున్నట్లు సమాచారం. 


తెలంగాణ తమ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని వ్యూహాలు రచిస్తున్న బీజేపీ నేతలు... ఈ రెండు పర్యటనలకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనల తర్వాత పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని కూడా ఊహించారు. ఒకే నెలల ఇద్దరి అగ్రనేతల పర్యటన పార్టీలో కొత్త జోష్ నింపుతుందని కూడా భావించారు. కానీ ప్రధానమంత్రి పర్యటన ప్రస్తుతానికి వాయిదా పడింది. ఎప్పుడు ప్రధాని పర్యటన ఉన్నా సరే అందుకు తగ్గట్టుగానే శ్రేణులు, పార్టీ నాయకులు ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతానికి వాయిదా మాత్రమే పడిందని... రీ షెడ్యూల్ త్వరలోనే ఉంటుందని అంటున్నారు.